KCR : కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. వాటిపైనే ఫోకస్

KCR : కేసీఆర్ ఢిల్లీ పర్యటన.. వాటిపైనే ఫోకస్
KCR : ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ... పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు.

KCR : ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్‌ ... పలువురు జాతీయ స్థాయి ప్రతిపక్ష పార్టీల నేతలను కలుసుకొన్నారు. సమాజ్‌వాది పార్టీ అధినేత, ఉత్తర ప్రదేశ్ ప్రతిపక్ష నేత అఖిలేష్ యాదవ్‌, సీనియర్ నాయకుడు రామ్‌గోపాల్ యాదవ్‌తో సమావేశం అయ్యారు. తన నివాసానికి వచ్చిన వారిద్దరినీ కేసీఆర్ శాలువ కప్పి సన్మానించారు. అనంతరం దేశ రాజకీయాలపై గంటపాటు చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చించినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ఈడీ విచారణ, బెంగాల్‌ మంత్రి పార్థ ఛటర్జీ, అర్పిత ఛటర్జీ నివాసాలపై ఈడీ దాడులు, ఆమ్‌ఆద్మీ పార్టీ సీనియర్ నేత, , ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ ఈడీ విచారణ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి. ప్రతిపక్ష నేతలపై మోదీ సర్కారు సీబీఐ, ఈడీ, ఐటీ అధికారులను ప్రయోగిస్తోందనే చర్చ జరిగింది. దీన్ని అడ్డుకోవడానికి చేపట్టాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక పైనా వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి సీఎం కేసీఆర్‌.. ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ రాష్ట్రపతిని మాత్రం కలవలేదు. అంతేకాదు... ఢిల్లీలో పలువురు మేధావులు, రిటైర్డ్ బ్యూరోక్రాట్లతో సమావేశమవుతారని అనుకున్నప్పటికి అదీ జరగలేదు.

మరోవైపు రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచే సమీక్ష చేశారు. తెలంగాణ, హైదరాబాద్‌లో వరద పరిస్థితులపై అధికారులతో సమీక్ష జరిపారు. భారీ వర్షాలు, వరదల వల్ల రూ.1400 కోట్ల వరకు నష్టం వాటిల్లందని, ఈ నష్టాలపై ప్రాథమిక అంచనాలను ఇప్పటికే కేంద్రానికి పంపారు. తక్షణ సాయంగా వెయ్యి కోట్లు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే.. కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు.

ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి నిధులు ఇవ్వడం లేదు. అటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌తో పాటు మరో సంస్థ ఇంకో ఇరవై శాతం రుణాలు ఇవ్వాల్సి ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తవుతున్నా ఈ రుణాలు మాత్రం ఇవ్వలేదు. ఈ సంస్థలు తాము ఇచ్చిన రుణానికి కేంద్రం గ్యారంటీ ఇప్పించాలని పట్టుబడుతున్నాయి.ఇప్పటికే తెలంగాణకు ఇవ్వాల్సిన అప్పులపై కేంద్రం పరిమితి విధించింది. ఇప్పుడు ఫైనాన్స్ కార్పొరేషన్ల రుణాలపైనా ఆంక్షలు విధిండంతో కేసీఆర్‌ సర్కారు చిక్కుల్లో పడింది.

ఇవన్నీ పరిష్కరించేందుకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ పర్యటనలో... ఒకరిద్దరిని తప్ప ప్రముఖులెవరినీ కలవలేకపోయారు. తెలంగాణలో వరద తగ్గుముఖం పట్టకపోవడం, అటు మంత్రి కేటీఆర్ కాలిగాయంతో ఇంటికే పరిమితమైన ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన సైతం సక్సెస్‌ కాకపోవడంతో.. టీఆర్‌ఎస్‌ శ్రేణులు అసంతృప్తితో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story