KTR : కేసీఆర్ అసెంబ్లీకి వస్తారు: కేటీఆర్

ఈనెల 12 నుంచి జరిగే బడ్జెట్ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని కేటీఆర్ స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో కేసీఆర్ పాల్గొంటారు. ఆయన వచ్చి కాంగ్రెస్ నేతల అబద్ధాలు, దూషణలు పడాలా? ఇలాంటి నేతలున్న సభకు ఆయన రావాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. వీరి స్థాయికి మేం చాలు. ఆయన అవసరం లేదు’ అని తెలిపారు. ఈనెల 16 తర్వాత ఫార్ములా ఈ-రేసు కేసులో తనను మళ్లీ విచారణకు పిలుస్తారని పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్రంలో భారీ స్కామ్‌కు తెరలేసిందని, టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు సీఎం రేవంత్ టీమ్ సిద్ధమవుతోందని కేటీఆర్ ఆరోపించారు. రేవంత్‌కు చెందిన నలుగురు వ్యక్తులు హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్‌లు కొంటున్నారని పేర్కొన్నారు. ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు అందాల పోటీకి రూ.200కోట్లు ఖర్చు చేస్తారట. దీని వల్ల ఏమైనా లాభం ఉందా?’ అని ప్రశ్నించారు.
అయితే తాము ప్రతిపక్షం లేని రాజకీయం చేయాలనుకోవడం లేదని సీఎం రేవంత్ అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికే ఎక్కువ సమయం ఇస్తున్నామని తెలిపారు. మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడుతూ ‘జీతభత్యం తీసుకుని పని చేయని వ్యక్తి కేసీఆర్. ఆయన చేసిన అప్పులు, తప్పులను అసెంబ్లీలో పెడతాం. కేసీఆర్ కు భయపడి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం లేదు. మూసీకి నిధులు తెస్తే ఆయనకు సన్మానం చేస్తాం’ అని వ్యాఖ్యానించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com