KCR–Revanth Reddy : కెసిఆర్-రేవంత్ అభివాదం.. ఇదే కావాలంటున్న కార్యకర్తలు.

తెలంగాణ అసెంబ్లీలో నిన్న అరుదైన దృశ్యం కనిపించింది. మాజీ సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత అసెంబ్లీకి వచ్చారు. ఆయన తన సీట్లో కూర్చున్న తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలోకి వచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కెసిఆర్ సీటు దగ్గరికి వెళ్లి పరామర్శించారు. కెసిఆర్ కూడా లేచి రేవంత్ రెడ్డితో షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇద్దరు అభివాదం చేసుకొని నవ్వుతూ పలకరించుకున్నారు. అటు బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ రెడ్డికి అభివాదం చేశారు. ఇలా పరస్పరం నవ్వుతూ పలకరించుకోవడం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. ఇరు పార్టీల కార్యకర్తలు దీనిమీద సానుకూలంగా స్పందించారు. ఇలాంటి మంచి వాతావరణం రాజకీయాల్లో ఉండాలని కామెంట్లు పెడుతున్నారు. నిజమే మరి అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు అస్సలు మంచివి కావు.
అసెంబ్లీలో కేవలం ప్రజల సమస్యల మీద మాత్రమే సానుకూలంగా అందరూ చర్చించాలి. మొన్నటిదాకా సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ తో పాటు ఇరు పార్టీల నేతలు ఏ స్థాయిలో తిట్టుకున్నారో మనం చూశాం. అలా వాళ్ళు తిట్టుకోవడం వల్ల ప్రజలకు వచ్చేది ఏమీ ఉండదు. రాజకీయాల్లో చాలా హుందాతనం కావాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోల్స్ చేయడం పోస్టులు పెట్టడం వల్ల ప్రజలకు వచ్చే ఉపయోగమేమీ ఉండదు. తమ నాయకుడు అవతలి పార్టీ వాళ్లను తిడితే సంతోషించే వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారు. అదే నాయకుడు అవతలి పార్టీ వాళ్ళతో నవ్వుతూ పలకరిస్తే మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. ఒకప్పటి రాజకీయాలు చాలా హుందాగా ఉండేవి కానీ ఇప్పుడు మాత్రం వ్యక్తిగత దూషణలకు మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. ప్రజలు ఇలాంటి రాజకీయాలను చూసి చూసి విసిగిపోయారు.
ఇప్పుడు వాళ్లకు కావాల్సింది వాళ్ళ సమస్యల మీద అన్ని పార్టీల వాళ్లు చర్చలు జరిపి పరిష్కారం చూపించడం మాత్రమే. ఎందుకంటే అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలు చేసుకుంటే అసలు సమస్యలు మాత్రం పక్కకు వెళ్ళిపోతాయి. పనికిరాని విషయాల గురించి చర్చలు జరుగుతాయి. రాబోయే రోజుల్లో కూడా కేసీఆర్ అయినా రేవంత్ రెడ్డి అయినా సరే ఇలా హుందాగా మాట్లాడుకుంటూ ప్రజా సమస్యల మీద మాట్లాడాలని ఇరు పార్టీల నాయకులు కార్యకర్తలు కోరుకుంటున్నారు. మరి రెండు పార్టీల నేతలు ఎలా ముందుకు వెళ్తారు అనేది మాత్రం వేచి చూడాల్సిందే.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

