Kishan Reddy : కాంగ్రెస్ తెచ్చిన మార్పు ఏది? : కిషన్ రెడ్డి
నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని, ఇచ్చిన హామీలను అమలు చేయాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు మద్దతుగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద చేపట్టిన నిరుద్యోగ మహాధర్నాలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ‘‘తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్, కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయకుండా, నోటిఫికేషన్లు ఇవ్వకుండా యువతను మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు కూడా అదే పద్ధతిలో అన్యాయం చేస్తున్నది. బీజెవైఎం కార్యకర్తలపై, నిరుద్యోగులపై కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఖండిస్తున్నాం. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ యూత్ డిక్లరేషన్ పేరుతో నిరుద్యోగులకు అనేక రకాల హామీలిచ్చి, అధికారంలోకి వచ్చాక మోసం చేసింది. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని చెప్పి ఏ ఒక్కటీ అమలు చేయడం లేదు. నిరుద్యోగులను అవమానపర్చేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటాన్ని ఖండిస్తున్నాం”అని కిషన్ రెడ్డి అన్నారు.
జాబ్ క్యాలండర్ ఎక్కడ?
గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అమలు చేయలేదని, రేవంత్ ప్రభుత్వం కూడా మాట ఇచ్చి తప్పిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘‘2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నరు. ఎక్కడపోయాయి..? జాబ్ క్యాలెండర్ గురించి మర్చిపోయారు. విద్యార్థులకు రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డులు ఏవి..? 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ ఇస్తామని చెప్పి మాట తప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజాభవన్ కు వెళ్లడం లేదు.. దరఖాస్తులు తీసుకోవడం లేదు. సెక్రటేరియట్ కు కాంగ్రెస్ నాయకులు, పైరవీకారులకు ఎంట్రీ ఉంది. కానీ, నిరుద్యోగ యువకులను వెళ్లనివ్వడం లేదు. అతి తక్కువ కాలంలోనే ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నవి కర్నాటకలోని సిద్ధరామయ్య ప్రభుత్వం, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు”అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com