కౌశిక్ రెడ్డికి మంచి భవిష్యత్తు వుంది : కేసీఆర్

రాజకీయాలు నిరంతర ప్రక్రియ.... గెలుపోటములు సహజం అని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ కష్టపడి సాధించిన రాష్ట్రం అని, ఎవరూ అప్పనంగా ఇవ్వలేదని చెప్పారు. ఏ పూటకు ఆ పూట రాజకీయాలు చేయొద్దన్నారు. శాశ్వతంగా అధికారం ఎవరికీ ఉండదని చెప్పారు. కాంగ్రెస్‌ను వీడిన పాడి కౌశిక్ రెడ్డిని టీఆర్‌ఎస్ కండువా కప్పి... కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు. తెలంగాణ అభ్యున్నతిలో భాగస్వామ్యం అయ్యేందుకే కౌశిక్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరినట్టు తెలిపారు. కౌశిక్ రెడ్డికి మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.
తెలంగాణలో ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉందని కేసీఆర్ అన్నారు. దళిత బంధు పథకం ఎన్నికల స్టెంట్ కాదని స్పష్టంచేశారు. దళిత బంధు పథకంపై తప్పుడు ప్రచారం మానుకోవాలని చెప్పారు. రక్షణ నిధి పేరుతో ప్రతి జిల్లాకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. దళితుల అభ్యున్నతి కోసమే 10లక్షల రూపాయలు ఇస్తున్నట్టు వివరించారు.
ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనన్ని పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నట్టు కేసీఆర్ తెలిపారు. రైతు బంధు ద్వారా అన్నదాతలకు ఎంతో మేలు చేకూరుతోందోని చెప్పారు. ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు మానుకోవాలని అన్నారు. ఏ పథకం తీసుకొచ్చినా విమర్శలు చేయడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని కేసీఆర్ ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com