కారు పార్టీపై కుట్రనా.. కేటీఆర్ ఆరోపణలు నిజమేనా..?

గులాబీ పార్టీపై కుట్ర జరుగుతోందని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. బీఆర్ ఎస్ ను లేకుండా చేయడం కోసం కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని.. పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు కేటీఆర్. ఆయన వ్యాఖ్యలతో ఇప్పుడు కొత్త విషయంపై చర్చ జరుగుతోంది. ఓవైపు తెలంగాణలో నీటి వాటాలపై పెద్ద ఎత్తున రగడ సాగుతోంది. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుతో పాటు కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణ నీటి వాటాలపై మాజీ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్లతో రగడ మొదలైంది. రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో దీనిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయి అని చెప్పడం మరింత వివాదాన్ని రాజేస్తోంది. వాస్తవానికి బీజేపీ, కాంగ్రెస్ అంటేనే బద్ధ శత్రువులు. దేశ వ్యాప్తంగా ఈ రెండు పార్టీల నడుమ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వివాదాలు ఉన్నాయి.
అలాంటి రెండు పార్టీలు ఏ రాష్ట్రంలో అయినా ఒక్కటి అవుతాయా అంటూ ఆ రెండు పార్టీలకు చెందిన కార్యకర్తలు మాట్లాడుతున్నారు. కేటీఆర్ తమ పార్టీ ఉనికిని కాపాడుకోడానికే ఇలాంటి పసలేని ఆరోపణలు చేస్తున్నారంటూ చెబుతున్నారు. ఎక్కడ ఒక్కటి అయ్యాయో చెబితే ప్రజలు ఎంతో కొంత నమ్మేవారని.. కానీ అలా చేయకుండా కేవలం నోటి మాటలతో సరిపెడితే కేటీఆర్ మాటలకు క్రెడిబిలిటీ కూడా ఉండదని చెబుతున్నారు. గతంలో కేసీఆర్ వేరే పార్టీలతో పొత్తు పెట్టుకున్న విషయాలను బీజేపీ చూపిస్తోంది. కేసీఆర్ అవసరాలను బట్టి మారుతారని.. తమ బీజేపీ అలా మారదని అంటున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు.
బీజేపీతో తమ పార్టీనే బలంగా కొట్టాడుతోందని.. బీఆర్ ఎస్, బీజేపీ ఒక్కటైపోయాయని కాంగ్రెస్ అంటోంది. మొత్తంగా ఇలా ఎవరికి వారే ఆరోపణలు చేస్తూ రచ్చ చేస్తున్నారు. కేటీఆర్ చేసిన మాటలు పక్కాగా తెలంగాణలో బీఆర్ ఎస్ ఉనికిని కాపాడుకోడానికి అన్నట్టే ఉన్నాయని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలు నమ్మకపోవడంతో ఇలాంటి మాటలు అంటున్నారని చెబుతున్నారు. ఇక నేడు అసెంబ్లీలో నీటి వాటాలపై పెద్ద ఎత్తున వివాదాలు నడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

