తెలంగాణ

KTR: ఏడున్నరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదు-కేటీఆర్

KTR: అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి.

KTR: ఏడున్నరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీ చేసిందేమీ లేదు-కేటీఆర్
X

KTR: తెలంగాణలో కారు-కమలం కయ్యం మరింత ముదురుతోంది. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటలు మంటలు రేపుతున్నాయి. వరి వార్‌తో మొదలైన రెండు పార్టీల మధ్య పొలిటికల్ వార్.. తాజాగా 317 జీవో రగడతో రాజకీయ రచ్చ మరింత ముదిరింది. ఇరు పార్టీల నాయకుల సవాల్, ప్రతిసవాళ్లతో సెగలు రేపుతుండగా.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ అరెస్ట్, ఆపార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా హైదరాబాద్ పర్యటన, తర్వాత పరిణామాలు తెలంగాణలో కాక రేపుతున్నాయి.

మంగళవారం హైదరాబాద్‌కు వచ్చిన జేపీ నడ్డా.. టీఆర్ఎస్ ప్రభుత్వంపైనా, సీఎం కేసీఆర్ పైనా తీవ్ర విమర్శలు, ఆరోపణలు గుప్పించారు. జేపీ నడ్డా వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జేపీ నడ్డా.. అబద్దాల అడ్డా.. కేరాఫ్ ఎర్రగడ్డ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.

నీతి ఆయోగ్‌కు ఉన్న నీతి కూడా నడ్డాకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుటుంబపాలన అని విమర్శలు చేస్తున్నారన్న మంత్రి.. ఉద్యమంలో పాల్గొన్న నాయకులు పాలించకూడదా అంటూ ప్రశ్నించారు. కుటుంబపాలన అంటూ నడ్డా మాట్లాడటం విడ్డూరంగా ఉందన్న కేటీఆర్.. బీజేపీలో కుటుంబపాలన గురించి ఎందుకు చెప్పట్లేదని మండిపడ్డారు.

అమిత్ షా కుమారుడికి బీసీసీఐ పదవి, జేపీ నడ్డా అత్తకు మంత్రి పదవి ఎలా వచ్చిందో జేపీ నడ్డా చెప్పాలని మంత్రి కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వంపైనా, మోదీ సర్కారు పాలనా విధానాలపైనా మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏడున్నరేళ్లలో కేంద్రంలో ఉన్న బీజేపీచేసిందేమీ లేదని ఆరోపించారు.

సామాజిక వర్గాల మధ్య చిచ్చుపెట్టి ఓట్లు పొందేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. 2022 కల్లా రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న ప్రధాని మోదీ.. రైతు విరోధిగా మారారన్నారు. తెలంగాణ సహా 28 రాష్ట్రాల ప్రజలకు ఇళ్లు అనే హామీ కూడా జుమ్లా అంటూ విమర్శించారు. వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని.. సీబీఐ, ఈడీలను ఉసిగొల్పుతూ మోదీ పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు.

రైతుబంధు, రైతుబీమా తెచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్న కేటీఆర్..​తెలంగాణ పథకాలను నకలు కొట్టిన దౌర్భాగ్య పరిస్థితి బీజేపీదంటూ విమర్శించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత కనీసం అభివృద్ది కార్యక్రమాలను చేపట్టలేని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం మోదీ సర్కారు అని అన్నారు. 317 జీవో పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే.. ఉద్యోగులు ,ప్రభుత్వానికి మధ్య సంబంధం ఉంటుందన్న మంత్రి కేటీఆర్.. బీజేకి ఏం సంబంధమని అని ప్రశ్నించారు.

మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఇన్‌ఛార్జీ తరుణ్ చుగ్ ఖండించారు. బండి సంజయ్ అరెస్టు, జేపీ నడ్డా టూర్ ఎపిసోడ్‌లో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు పింక్‌ డ్రెస్ వేసుకున్న కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అప్రజాస్వామిక ప్రభుత్వంపై బీజేపీ పోరాటం కొనసాగిస్తుందని తరుణ్ చుగ్ హెచ్చరించారు.

మరోవైపు ఆందోళనలో భాగంగా ఈనెల 10న తెలంగాణ బంద్‌కు పిలుపునిచ్చింది బీజేపీ. 317 జీవో సవరించాలని, అక్రమ కేసులకు నిరసనగా బంద్ చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది బీజేపీ అధిష్టానం. మొత్తానికి టీఆర్ఎస్, బీజేపీ మధ్య పొలిటికల్ వార్ రోజురోజుకు మరింత ముదురుతోంది. మరి కారు-కమలం కయ్యం.. ఏ రాజకీయ మలుపు తీసుకుంటుంది..? మంత్రి కేటీఆర్ కౌంటర్లకు రాష్ట్ర బీజేపీ నేతలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారు అనేది చూడాలి.

Divya Reddy

Divya Reddy

Divya reddy is an excellent author and writer


Next Story

RELATED STORIES