KTR: ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ.. ఇకపై దూకుడు తప్పదు!

KTR: ముందస్తు ఎన్నికలపై కేటీఆర్ క్లారిటీ.. ఇకపై దూకుడు తప్పదు!
KTR: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

KTR: తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం తమకు లేదని కుండ బద్దలు కొట్టారు. వాళ్లు తేదీ ప్రకటిస్తే అసెంబ్లీ రద్దు చేస్తామని సీఎం చెప్పారని, కానీ బీజేపీ నుంచి ఎలాంటి స్పందనా లేదని అన్నారు.. అన్ని వ్యవస్థలతోపాటు ఈసీ కూడా కేంద్రం చేతుల్లో ఉందని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు అంటూ మీడియా చిట్‌చాట్‌లో చెప్పుకొచ్చారు కేటీఆర్‌.

మొన్న వచ్చిన సర్వే బీజేపీదని, నిన్నటి సర్వే కాంగ్రెస్‌దని చెప్పిన కేటీఆర్‌.. ఆ రెండు సర్వేల్లోనూ టీఆర్‌ఎస్‌దే గెలుపని తేలిందన్నారు. ప్రత్యర్థులు సైతం టీఆర్ఎస్‌దే గెలుపని ఒప్పుకుంటున్నారని కామెంట్ చేశారు. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు టీఆర్‌ఎస్‌దే గెలుపని ఒప్పుకున్నారని చెప్పుకొచ్చారు. ఎనిమిదేళ్ల పాల‌న త‌ర్వాత ప్రజల నుంచి మంచి స్పంద‌న వ‌చ్చింద‌న్నారు. బ‌లంగా ఉన్న నేత‌ల‌ను పార్టీ క‌లుపుకొని పోతుంద‌ని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఒక్క పార్టీయే రాష్ట్రం అంత‌టా ఉంద‌న్నారు. తమ సర్వే ప్రకారం ఈసారి ఎన్నికల్లో 90కిపైగా సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు ఎలా ఉన్నా.. ఇకపై ప్రతిపక్షాలపై దూకుడుగా వెళ్లాలని డిసైడ్‌ అయ్యామన్నారు కేటీఆర్. రూపాయి విలువపై గతంలో ప్రధాని మోదీ చాలా మాట్లాడారని, ఇప్పుడు రూపాయి విలువ ఎలా ఉందో తెలుసుకోవాలంటూ కేటీఆర్‌ సెటైర్లు విసిరారు. కేంద్రానికి తెలంగాణ ఇచ్చేది ఎక్కువ.. తెలంగాణకు మాత్రం కేంద్రం ఇచ్చేది తక్కువ అంటూ విమర్శలు గుప్పించారు. తన లెక్కలు తప్పని ఎవరైనా నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానన్నారు కేటీఆర్. గెడ్డం తీసుకుంటా అన్నవాళ్లు రంగులేసుకొని తిరుగుతున్నారని, మాట్లాడేటప్పుడు ప్రతిపక్షాలు జాగ్రత్తగా ఉండాలన్నారు.

పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాజకీయ సన్యాసం అంటూ మాట్లాడారని, ఈ విషయంలో లగడపాటిని మెచ్చుకోవాలన్నారు కేటీఆర్. మంచి పనులతో మనసులు గెలుచుకోవడం బీజేపీకి తెలియదన్నారు కేటీఆర్‌.. వాపును చూసి కొందరు బలపు అనుకుంటున్నారంటూ కామెంట్‌ చేశారు.. ఇక సిరిసిల్లకు రాహుల్‌ వస్తే స్వాగతిస్తామని, వచ్చి నేర్చుకోమని కేటీఆర్‌ సూచించారు. ఇక టీఆర్‌ఎస్‌ రాష్ట్రమంతటా ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రవ్యాప్తంగా లేవని, కొన్ని చోట్ల షర్మిల కూడా ఉందని మంత్రి కేటీఆర్ కామెంట్ చేశారు.

బీహార్‌లో ఒకప్పుడు ఆర్జేడీ ఉండేదని, జార్ఖండ్ ఏర్పాటయ్యాక ఆ పార్టీ లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు. ఇక త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్లు అందిస్తామని, సీఎం కేసీఆర్ త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయని కేటీఆర్‌ గుర్తు చేశారు. ఉద్యోగుల జీతాలను భారీగా పెంచింది కేసీఆర్ మాత్రమేనన్నారు. ఉద్యోగుల జీతాల చెల్లింపు ఆలస్యం కావడం పెద్ద విషయం కాదని.. పరిస్థితులను బట్టి అలా జరుగుతుంటాయని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Tags

Read MoreRead Less
Next Story