KTR: టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు కేటీఆర్ మాస్టర్ ప్లాన్..

KTR (tv5news.in)
KTR: టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. రోజుకో 20 నియోజకవర్గాల నేతలతో సమావేశం అవుతున్న కేటీఆర్.. ఇవాళ మంత్రి పువ్వాడ నేతృత్వంలో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నేతలు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశం అయ్యారు.
ఖమ్మం, పీలేరు, వైరా, అశ్వారావుపేట, భద్రాచలం, ఇల్లందు, పినపాక, కొత్తగూడెం, మధిర నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్ నేతలు, నియోజకవర్గ స్థాయి ముఖ్యనేతలు సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి జిల్లాలో పార్టీ బలోపేతంతోపాటు భవిష్యత్ కార్యాచరణపైనా చర్చించారు.. ఈనెల 25న జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీ, నవంబరు 15న జరగనున్న టీఆర్‌ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాలకు సంబంధించిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
ద్విదశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులంతా కృషిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్లీనరీ, బహిరంగ సభ కార్యాచరణ కోసం గ్రామ, మండలస్థాయి కార్యకర్తల సమావేశాలను స్థానిక ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో నిర్వహించాలని సూచించారు. ఈనెల 27న జరిగే నియోజకవర్గ స్థాయి సన్నాహక సమావేశాలలోపు ఈ సమావేశాలు పూర్తి చేయాలన్నారు. బహిరంగ సభకు ప్రతి గ్రామ కమిటీ నుంచి కచ్చితంగా కమిటీ సభ్యులు హాజరయ్యేలా కార్యాచరణ ఉండాలన్నారు.
పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం విజయవంతంగా ముందుకు పోతోందని, త్వరలోమరింత పెద్ద ఎత్తున పార్టీ వ్యవస్థాగత నిర్మాణ కార్యాచరణ ఉంటుందని కేటీఆర్ చెప్పారు. అంతేకాకుండా, పార్టీ జిల్లా కార్యాలయాల ప్రారంభోత్సవాన్ని పార్టీ చీఫ్ కేసీఆర్ త్వరలోనే చేస్తారన్నారు. నవంబరు 15న బహిరంగ సభ తర్వాత పార్టీ శ్రేణులకు, ప్రజప్రతినిధులకు శిక్షణా కార్యక్రమాలు జరుగుతాయని కేటీఆర్ చెప్పారు.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని చెప్పారు.. ప్రభుత్వంలోకి వచ్చిన నాటి నుంచి అద్భుతమై. పాలనతో తెలంగాణ ప్రజల ఆకాంక్షను సాకారం చేస్తూ వస్తున్నది టీఆర్‌ఎస్సేనన్నారు. ప్రభుత్వం చేపట్టిన అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు సమాయత్తం కావాలని పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com