KTR : ఈడీ కేసు పైనా హైకోర్టుకు కేటీఆర్?

ఫార్ములా ఈ-రేసు వ్యవహారంపై ఏసీబీ కేసు విషయంలో కేటీఆర్‌కు కొంత ఊరట దక్కిన సంగతి తెలిసిందే. ఆయనను ఈనెల 30 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశించింది. అయితే గంటల వ్యవధిలోనే ఆయనపై ఈడీ కేసు ఫైల్ చేసింది. దీనిని కూడా క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. క్వాష్ పిటిషన్ వేయాలా? పిటిషన్ వేయకుండా ఈడీ విచారణకు హాజరవ్వాలా అనే దానిపై ఆయన న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఈడీ వేగంగా స్పందించింది. గురువారం ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో శుక్రవారం ఉదయం వివరాలు ఇవ్వాలని లేఖ రాసింది. సాయంత్రమే వివరాలు సేకరించి ఈసీఐఆర్ నమోదు చేసింది. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ బ్యాంకు ఖాతా నుంచి యూకేలోని ఎఫ్‌ఈవో సంస్థ ఖాతాకు జరిగిన నగదు బదిలీ లావాదేవీలపై ఈడీ దృష్టి సారించనుంది. గతేడాది అక్టోబరులో సుమారు రూ.45.71 కోట్లను యూకే అధికారిక కరెన్సీ బ్రిటీష్ పౌండ్ రూపంలో బదిలీ చేసిన ఉదంతంపై ఆరా తీయనుంది. ఈ వ్యవహారంలో ఫెమా, పీఎంఎల్‌ఏ చట్టాల ఉల్లంఘనలపైనే ఈడీ ప్రధానంగా దృష్టి సారించనుంది. నిధులను విదేశాలకు మళ్లించిన అనంతరం అంతిమంగా మరెవరి ఖాతాలోకైనా చేరాయా..? అనే అంశంపై ఈడీ కూపీ లాగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com