KTR : జెడ్పీటీసీ దంపతులు కొడుకుకు నామకరణం చేసిన కేటీఆర్

రాజకీయ నాయకులపై అభిమానాన్ని కార్యకర్తలు పలు విధాల్లో వ్యక్తం చేస్తుంటారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన జెడ్పీటీసీ దంపతులు లావణ్య, రాంబాబు తమ అభిమాన నేత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో తమ కుమారుడికి పేరు పెట్టించుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. అశ్వారావుపేట నియోజకవర్గానికి చెందిన ఈ జంట తమ చిరకాల కోరికను తీర్చుకోవడానికి తమ కుమారుడితో కలిసి కేటీఆర్‌ను కలిశారు. తమ బిడ్డకు ఆయన చేతుల మీదుగా నామకరణం చేయాలని కోరారు. వారి అభిమానానికి ముగ్ధుడైన కేటీఆర్, వారిని, చిన్నారిని ఆప్యాయంగా పలకరించారు.
ఈ సందర్భంగా, పిల్లల పండితులు సూచించినట్లుగా సు అక్షరంతో మొదలయ్యే పేరును పెట్టాలని దంపతులు కోరారు. దానికి కేటీఆర్ తన కుమారుడు హిమాన్షు పేరును గుర్తు చేసుకుంటూ.. సు అక్షరంతో సూర్యాంశ్ అనే పేరును సూచించారు. ఈ పేరును దంపతులు ఖరారు చేయగా, కేటీఆర్ ఆ చిన్నారికి నామకరణం చేశారు. ఈ అనూహ్య ఘటనతో దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. "మా అభిమాన నాయకుడు మా అబ్బాయికి పేరు పెట్టడం జీవితంలో మర్చిపోలేని అపురూపమైన క్షణం. ఆయన ఆశీస్సులతో మా కొడుకు కూడా ఆయనలాగే ఉన్నత స్థాయికి ఎదుగుతాడని నమ్ముతున్నాం" అని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ భావోద్వేగ క్షణాలకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన అభిమానం, ఆశీస్సులకు ప్రతీకగా నిలిచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com