KTR : కేటీఆర్ క్వాష్ పిటిషన్‌పై విచారణ వాయిదా

ఫార్ములా-ఈ రేసులో తనపై నమోదైన కేసులు కొట్టివేయాలని కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు మ.2.30 గంటలకు వాయిదా వేసింది. కేటీఆర్ తరఫు న్యాయవాది వాదనలు ముగించారు. ఏసీబీ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్ వాదనలు వినిపిస్తున్నారు. ఫార్ములా - ఈ రేసు వ్యవహారంలో ఒప్పందం జరగకముందే చెల్లింపులు చేశారని ఆయన కోర్టుకు తెలిపారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో రూ.46 కోట్లు చెల్లించినట్లు చెప్పారు. ఈ - కార్ల రేసింగ్ సీజన్ 10 ఒప్పందానికి ముందే నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపులు చేశారన్నారు. దర్యాప్తు ఏ దశలో ఉందని ఈ సందర్భంగా ఏజీని హైకోర్టు ప్రశ్నించింది. కేసు విచారణ ప్రాథమిక దశలోనే ఉందని.. అన్ని ఆధారాలు బయటపడతాయని ఏజీ తెలిపారు. ఇప్పటికే ఫిర్యాదుదారు దానకిశోర్ వాంగ్మూలం సేకరించినట్లు కోర్టుకు తెలిపారు. నిందితులు అరవింద్ కుమార్, బీఎల్‌ఎన్ రెడ్డి ఏమైనా పిటిషన్లు దాఖలు చేశారా అని న్యాయస్థానం అడిగింది. ఇప్పటివరకు నిందితులు ఎలాంటి పిటిషన్లు దాఖలు చేయలేదని, ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదని ఏజీ తెలిపారు. గవర్నర్ అనుమతి తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని ధర్మాసనానికి ఏజీ తెలిపారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com