హైదరాబాద్‌లో వర్షాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష

హైదరాబాద్ నగర పరిధిలో భారీ వర్ష సూచన నేపథ్యంలో.. అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మున్సిపల్ మంత్రి కేటీఆర్ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నానక్‌రామ్‌గూడలోని కార్యాలయంలో జీహెచ్‌ఎంసీ, పురపాలక శాఖ ఉన్నతాధికారులతతో కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. రానున్న రెండు మూడ్రోజులపాటు నగరంలో భారీ వర్షాలు కురిసే అవసరం ఉందని.. నగరపాలక సంస్థ ఇతర శాఖలన్నింటితో సమన్వయం చేసుకొని సిద్ధంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. ముఖ్యంగా జలమండలి, విద్యుత్ శాఖ, హైదరాబాద్ రెవెన్యూ యంత్రాంగం, ట్రాఫిక్ పోలీస్ లాంటి కీలకమైన విభాగాలతో నిరంతరం సమన్వయం చేసుకోవాలన్నారు.
ఇప్పటికే జీహెచ్‌ఎంసీ వర్షాకాల ప్రణాళికలో భాగంగా భారీ వర్షాల్ని సైతం ఎదుర్కొనేందుకు అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేసుకుని సంసిద్ధంగా ఉన్నట్లు జీహెచ్ఎంసి అధికారులు మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. నగరంలో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే ప్రధాన రహదారుల్లో డి-వాటరింగ్ పంపులు, సిబ్బంది మోహరింపు లాంటి ప్రాథమిక కార్యక్రమాల్ని పూర్తి చేసినట్లు తెలిపారు. జీహెచ్ఎంసి చేపట్టిన SNDP కార్యక్రమంలో భాగంగా నాలాల్ని బలోపేతం చేయడంతో.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇబ్బందులు తప్పుతాయన్నారు. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ వర్షాల వల్ల ప్రాణ నష్టం జరగకూడదన్న ఏకైక లక్ష్యంతో పని చేయాలని అధికారుల్ని మంత్రి కేటీఆర్ ఆదేశించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com