KTR : సకల మర్యాదలతో రాజీవ్ విగ్రహాన్ని తొలగిస్తాం : కేటీఆర్

తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ( Rajiv Gandhi Statue ) తొలగిస్తామని, సకల మర్యాదలతో అక్కడి నుంచి రాజీవ్ విగ్రహం తొలగించి ఆ స్థలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్టిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) అన్నారు. గణేశ్ నిమజ్జనం సాక్షిగా రాజీవ్ గాంధీ విగ్రహం తొలగిస్తామని వ్యాఖ్యానించారు. సెప్టెంబర్ 17వ తేదీని బీఆర్‌ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవంగా పరిగణించి సంబరాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేసి తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఢిల్లీ పెద్దల మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టారని విమర్శించారు. గతంలో సోనియాగాంధీని బలిదేవత అని, రాహుల్ గాంధీని ముద్ద పప్పు అని రేవంత్ రెడ్డి తిట్టారని, ఇప్పుడు వాటిని కవర్ చేసుకోవడానికే రాజీవ్ విగ్రహం పెట్టారని అన్నారు.
రాజీవ్ గాంధీ కంప్యూటర్ కనిపెట్టాడని రేవంత్ రెడ్డి చెప్తున్నారని, కంప్యూటర్ కనిపెట్టిన ఛార్లెస్ బాబేజ్ ఆత్మ ఎక్కడున్నా బాధపడుతుందని, ఆయనకు తెలియదు, ఎవరైనా చెప్తే వినవంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పాలనే లేదు.. సెప్టెంబర్ 17ను ప్రజాపాలన అంటున్నాడని విమర్శించారు. వెంటనే ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం రూ.15 వేలు ఇచ్చి చూపించాలని సవాల్ విసిరారు. పింఛన్ల పెంపు రూ.4 వేలు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇచ్చిన 420 హామీలను నెరవేర్చే వరకు మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతు భరోసా, పింఛన్ ఎప్పుడిస్తారని, రూ.2500 ఎప్పుడిస్తారని ఆడబిడ్డలు ఎదురుచూస్తున్నారని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com