SAD: అన్నదమ్ముల బంధాన్ని ఆవిరి చేసిన ఆస్తి గొడవ

SAD: అన్నదమ్ముల బంధాన్ని ఆవిరి చేసిన ఆస్తి గొడవ
గొడవలో నిండు ప్రాణం బలి... మానవత్వాన్ని మట్టిలో కలిపేసిన భూమి పంచాయితి...

నారాయణ పేట జిల్లా ఊట్కూరు మండలంలోని చిన్నపొర్ల గ్రామంలో భూతగాదాలు ఓ నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. తాత పంచిన ఆస్తి.. అన్నదమ్ముల బంధాన్ని ఆవిరి చేసింది. ఎకరా భూమి కోసం జరిగిన తగాదా మానవత్వాన్ని మట్టిలో కలిపేసింది. పచ్చని పొలంలో నెత్తురు చిందించి చిన్నాన్న కుమారుడినే అమానుషంగా బలితీసుకుంది.


చిన్నపొర్ల గ్రామానికి చెందిన లక్ష్మప్పకు ఇద్దరు భార్యలున్నారు. పెద్ద భార్య బాలమ్మకు ఒక కుమారుడు సంజప్ప... చిన్న భార్య తిప్పమ్మకు ఇద్దరు కుమారులు పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్పలున్నారు. తనకున్న 9ఎకరాలను లక్ష్మప్ప ముగ్గురికి మూడెకరాల చొప్పున పంచగా ఇద్దరు భార్యలకు సమంగా పంచాలంటూ వివాదం మొదలైంది. తమకు రావాల్సిన ఎకరంన్నర భూమిని ఇవ్వాలంటూ సంజప్ప కుమారులు కొన్నాళ్లుగా తమ చిన్నమ్మ పిల్లలైన పెద్ద సౌరప్ప, చిన్న సౌరప్పలతో గొడవ పడుతూ వస్తున్నారు.

పెద్ద సౌరప్ప కుమారుడు సంజప్ప హైదరాబాద్‌లో మేస్త్రీ పనిచేస్తూ... అక్కడే ఉంటున్నారు. కుటుంబాన్ని నగరంలోనే ఉంచి పొలం సాగు చేసేందుకు పదిరోజుల క్రితం సంజప్ప ఊరికి వచ్చాడు. గురువారం మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో పొలం వద్దకు వెళ్లి, దున్నేందుకు ప్రయత్నిండగా అప్పటికే పొలానికి వచ్చిన పెద్దనాన్న కుటుంబం అడ్డుకుంది. ఈ క్రమంలోనే వాగ్వాదం చోటుచేసుకోగా సంజప్పపై కర్రలతో విచక్షణారహితంగా దాడిచేశారు. పెద్దనాన్న కుటుంబానికి చెందిన గుట్టప్ప, ఆశప్ప, ఆటో సంజు, చిన్న వెంకటప్ప, శ్రీను, కిష్టప్ప, నకలప్పతో పాటు ఇంకొదరు వ్యక్తులు సంజప్పపై దాడి చేయటంతో నిస్సహాయస్థితిలో కుప్పకూలిపోయాడు. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నా స్థానికులు అడ్డుకున్నా వదలకుండా చితకబాదారు.

ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న సంజప్పను స్థానికులు, కుటుంసభ్యులు నారాయణపేట ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించటంతో మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సంజప్ప అక్కడ ప్రాణాలు కోల్పోయాడు. గురువారం మధ్యాహ్నం అమానుష ఘటన చోటుచేసుకోగా దాడిదృశ్యాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. సంజప్ప మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించిన పోలీసులు నిందితులను విచారిస్తున్నారు.

Tags

Next Story