Telangana : తెలంగాణలో ముదురుతున్న రాజకీయ రగడ..

తెలంగాణలో రాజకీయాలు ఎక్కువగా భూముల చుట్టూ తిరుగుతున్నాయి. అయితే ఇండ్లు కూల్చడం లేదంటే భూ సేకరణ పేరుతో రాజకీయాలు ఎక్కువగా నడుస్తున్నాయి. ఈ రాజకీయాలు ఎక్కువగా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ ఎస్ అన్నట్టే సాగుతున్నాయి. పరిగి ఏరియాలోని కాడ్లాపూర్, రాపూర్ లో 1200 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ కోసం సేకరిస్తున్నారు. అయితే ఇక్కడ రైతులు కొందరు భూములు ఇవ్వడానికి సిద్ధపడట్లేదు. పైగా భూములు ఇచ్చిన వారికి సరైన పరిహారం చెల్లించట్లేదని రైతులు చెబుతున్నారు. దీంతో మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి అక్కడకు వెళ్లారు. రైతులకు మద్దతు తెలుపుతున్న సమయంలో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఇది కాస్తా పెద్ద ఎత్తున రచ్చకు దారి తీసింది. అంతకు ముందు కూడా చాలా విషయాల్లో తమను పోలీసులు ఇలాగే అరెస్ట్ చేస్తున్నారంటూ బీఆర్ ఎస్ నేతలు మండిపడుతున్నారు.
రైతుల తరఫున పోరాడుతున్న తమను ఇలా అరెస్ట్ లు చేయడం ఏంటని.. సమాధానాలు చెప్పలేకనే ఇలా అరెస్ట్ లు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. అయితే కాంగ్రెస్ చెబుతోంది మాత్రం ఇంకో విధంగా ఉంది. తెలంగాణలో కంపెనీలు రాకుండా డెవలప్ మెంట్ ఎలా జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. బీఆర్ ఎస్ హయాంలో కూడా ఇలా కంపెనీల కోసం భూములు సేకరించలేదా అని ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
అప్పుడు కూడా చట్ట ప్రకారమే పరిహారం చెల్లించారు తప్ప ఎలాంటి అడ్డంకులు చెప్పలేదని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. దీంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున రెండు పార్టీల నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్దీ ఇలాంటి రాజకీయ రచ్చ ఎక్కువగా జరుగుతోందనే చెప్పుకోవాలి. ఈ మధ్య ఇలాంటి అరెస్ట్ లు పెరగడం తమకు ప్లస్ పాయింట్ అన్నట్టు మాట్లాడుతున్నారు బీఆర్ ఎస్ నేతలు. మరి ఈ వివాదాలు ఎవరికి ప్లస్ అవుతాయో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
