Sagar To Srisailam Boat : సాగర్– శ్రీశైలం లాంచీ స్టార్ట్

పర్యాటకులు, ప్రకృతి ప్రేమికులు ఎదురుచూస్తున్న నాగార్జున సాగర్ నుంచి శ్రీశైలం వరకు బోటు ప్రయాణాన్ని కార్తిక మాసం తొలిరోజున తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించింది. గత ఐదేళ్లుగా ప్రణాళికలు వేసినప్పటికీ.. సాగర్‌లో సరైన స్థాయిలో నీరు లేకపోవడం, కరోనా మహమ్మారి తదితర కారణాలవల్ల వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో.. శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ వరకు గరిష్ఠ స్థాయిలో నీటి లభ్యత ఉంది. దీంతో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ లాంచీ ప్రయాణాన్ని ప్రారంభించింది. దాదాపు 120 కిలోమీటర్ల దూరం ఉండే ఈ ప్రయాణానికి మొదటి రోజు రాష్ట్రంతోపాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున పర్యాటకులు తరలివచ్చారు.నాగార్జున సాగర్ నుంచి నందికొండ మీదుగా ఏలేశ్వరం, సలేశ్వరం, తూర్పు కనుమలు, నల్లమల అటవీ ప్రాంత అందాలను వీక్షించేలా లాంచీ ప్రయాణానికి పర్యాటక శాఖ శ్రీకారం చుట్టింది. మరొక మార్గంలో నాగర్ కర్నూల్ జిల్లా సోమశిల నుంచి శ్రీశైలం వరకు లాంచీ సేవలను కూడా పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తీసుకొచ్చింది. కొల్లాపూర్ మండలం సోమశిల తీరంలో 120 మంది ప్రయాణించేలా ఏసీ లాంచీని అధికారులు శనివారం ప్రారంభించారు. అక్కడి నుంచి శ్రీశైలం వరకు 120 కిలోమీటర్ల మేర 7 గంటలపాటు ఈ ప్రయాణం ఉంటుంది. లాంచీ ప్రయాణానికి పెద్దలకు రూ.2 వేలు, పిల్లలకు రూ.1,600గా టికెట్ ధరలు నిర్ణయించారు. నాగార్జునసాగర్ డ్యాంలో నీటి మట్టం 575 అడుగులు ఉన్నంత వరకు, ప్రయాణికుల రద్దీని బట్టి శ్రీశైలానికి లాంచీలు నడపనున్నట్లు పర్యాటకాభివృద్ధి సంస్థ తెలిపింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com