TG : త్వరలోనే లిక్కర్ టెండర్లు.. పలు కీలక మార్పులు చేయనున్న ఎక్సైజ్ శాఖ..

TG : త్వరలోనే లిక్కర్ టెండర్లు.. పలు కీలక మార్పులు చేయనున్న ఎక్సైజ్ శాఖ..
X

తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకోనుంది. రాష్ట్రంలో మద్యం టెండర్ల గడువు ముగియనుండడంతో కొత్త టెండర్ల విధి విధానాలలో మార్పులు చేయనున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల లైసెన్స్ గడువును రెండు నుంచి మూడేళ్లకు పెంచేలా ఎక్సైజ్ శాఖ కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ప్రభుత్వం తో చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న వైన్ షాపుల టెండర్ నవంబర్ 30తో ముగియనుండగా. వచ్చే టర్మ్ లో దీనిని అమలుచేయాలని భావిస్తున్నారు అధికారులు.

కాగా స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ముందుగానే టెండర్ల ప్రక్రియ ను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఆగస్ట్ లో నే కొత్త టెండర్ల ప్రక్రియను ప్రారంభించి.. మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వ్యాపార నిబంధనల్లోనూ కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత.. నూతన కంపెనీల బ్రాండ్లను సైతం అనుమతించనున్నట్లు సమాచారం.

గతంలో ఉన్న విధానం ప్రకారం రూ. 2 లక్షల నాన్ రిఫండ్ విధానంతో టెండర్లు వేస్తారు. లాటరీ పద్ధతిలో వీరిని ఎంపిక చేసి మద్యం దుకాణాల ను కేటాయిస్తారు. కాగా రెండేళ్ల కాల పరిమితి తో ఈ టెండర్లు జరిగేవి. 2023_25 కు సంబంధించి మొత్తం 2,620 మద్యం దుకాణాలకు టెండర్లు నిర్వహించారు. ఐతే ఈసారి రూ. 3 లక్షల నాన్ రిఫండ్ తో టెండర్లను ఆహ్వానించనున్నారు. టెండర్లకు సంబంధించి లక్ష రూపాయలు పెంచినప్పటికీ లైసెన్స్ గడువు రెండు నుంచి మూడేళ్లకు పెంచడంతో ఎక్కువ మంది టెండర్లు వెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపించే అవకాశం ఉంది. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని మరింత పెంచే సువర్ణ అవకాశం. . రెండేండ్ల కాలపరిమితికి సంబంధించి ఒక్కో దుకాణానికి రూ.1.05 కోట్లు యాన్యువల్ ఫీజు నిర్ణయించారు. మున్సిపల్, కార్పొరేషన్ల పరిధిలో ఈ ఫీజు రూ. 60-80 లక్షలుగా ఉంది. ఈ సారి వీటిల్లో కూడా మార్పులు చేసే అవకాశం ఉంది. గత టెండర్ల లో ప్రభుత్వానికి యాన్యువల్ ఫీజు తో కలిపి 2,460 కోట్ల ఆదాయం రాగా ఈసారి దానిని మరింత పెంచేలా ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అంతే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల సంఖ్య ను కూడా పెంచుననట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 2,620 మద్యం దుకాణాలు ఉండగా.. అవసరం అయిన చోట కొత్త దుకాణాలకు పర్మిషన్ లు ఇవ్వనున్నారు. ఇటీవల ప్రకటించిన నూతన మున్సిపాలిటీల్లో కొత్త దుకాణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. మద్యం దుకాణాల టెండర్లు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుగానే టెండర్ల ప్రక్రియ జరగనున్నట్లు తెలుస్తోంది. 15 రోజుల పాటు టెండర్లు స్వీకరించి అనంతరం లాటరీ పద్ధతిలోనే ఎంపిక ప్రక్రియను చేపట్టనుంది తెలంగాణ ఎక్సైజ్ శాఖ.

Tags

Next Story