TG : 60లక్షల రైతులకు.. 22లక్షల మందికే రుణమాఫీ : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రుణమాఫీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ రైతులను మరోసారి మోసం చేసిందని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేట మహేశ్వర్ రెడ్డి అన్నారు. 60 లక్షల మంది రైతులు అర్హులుండగా..కేవలం 22 లక్షల మందికే రుణమాఫీ జరిగిందన్నారు. ఆదివారం నిర్మల్లో ఆయన మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే నిర్మల్లో ఈ నెల 23న రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. రైతు ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించి ప్రభుత్వ మెడలు వంచుతామన్నారు. రైతు భరోసాకు ఇవ్వాల్సిన నిధులనే రుణమాఫీకి డైవర్ట్ చేశారన్నారు. ఇప్పటికే రెండు పంటలకు రైతు భరోసా సాయం ఇవ్వకుండా ఎగ్గొట్టారని మండిపడ్డారు. రైతు భరోసా ఎప్పడు ఇస్తారో సర్కార్ సమాధానం చెప్పాలన్నారు.
సర్కార చేతులెత్తేసింది.. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేయలేక రేవంత్ సర్కార్ చేతులెత్తేసిందని ఏలేటి విమర్శించారు. రైతులందరికీ రుణాలు మాఫీ చేసామంటున్న సీఎం.. రుణ మాఫీ కాలేదంటున్న రైతులకు ఏం సమాధానం చెప్తారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు దమ్ముంటే గ్రామాల్లోకి వెళ్లాలని సవాల్ విసిరారు. మూడు విడతల్లో రుణమాఫీ చేసిన రైతుల వివరాలు వారం రోజుల్లోగా ప్రభుత్వం వెల్లడించాలని డిమాండ్ చేశారు. రైతు భరోసా ఖరీఫ్ సీజను డబ్బులను ఈ నెలాఖరులోగా రైతులకు ఇవ్వాలని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com