LOCAL WAR: పంచాయతీల్లో కాంగ్రెస్‌దే పై"చేయి"

తెలంగాణ పల్లెపోరులో హస్తం సత్తా చాటింది. గురువారం జరిగిన తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అర్ధరాత్రి 2 గంటల వరకు వెల్లడైన ఫలితాల మేరకు ఏకగ్రీవాలతో కలుపుకొని అధికార కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 2,383 సర్పంచి స్థానాల్లో విజయదుందుభి మోగించారు. సిద్దిపేట మినహా మిగిలిన జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంది. పలు చోట్ల గట్టిపోటీ ఇచ్చిన ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితి 1,146 పంచాయతీలను గెలుపొందింది. స్వతంత్ర అభ్యర్థులు 455 చోట్ల విజయం సాధించారు. వీటిలో సీపీఎం 14, సీపీఐ 16 చోట్లకు పైగా గెలిచాయి. భాజపా రెండువందల లోపు స్థానాలకు పరిమితమైంది. శీతాకాలమైనా ఉదయం ఆరు గంటల నుంచే పోలింగు కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. 7 గంటల నుంచి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పలుచోట్ల మహిళలు చంటి పిల్లలతో.. కొందరు వృద్ధులు అంబులెన్స్‌లో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తొలివిడత ఎన్నిక జరిగే ప్రాంతాల్లో 396 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. 3,834 సర్పంచి, 27,678 వార్డు సభ్యుల స్థానాలకు పోలింగ్ జరిగింది. 84.28 శాతం ఓటింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 92.88 శాతం పోలింగ్ జరగ్గా... భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అత్యల్పంగా 71.79 శాతం ఓట్లు పోలయ్యాయి. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మొత్తంగా కాంగ్రెస్ 58.5 శాతం గెలుపొందగా, బీఆర్ఎస్ 26 శాతం సీట్లను గెలిచింది. ఇక బీజేపీ ప్రభావం నామమాత్రమే అయింది.
పంచాయతీ ఎన్నికలు పార్టీ రహితమే అయినా.. క్షేత్రస్థాయిలో పార్టీల మధ్య సార్వత్రిక ఎన్నికలను మించి పోటీ జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల పక్షాన వర్గాలుగా సమీకరణ జరిగి.. పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికలను అధికార కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో అభ్యర్థుల ఎంపిక నుంచి నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం దాకా మంత్రులు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు దగ్గరుండి చూసుకున్నారు. వారి ప్రయత్నం ఫలితాల్లో ప్రతిఫలించింది. సిద్దిపేట మినహా అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ కంటే ఎక్కువగా కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులే సర్పంచ్‌లుగా గెలిచారు. కేసీఆర్, హరీశ్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పైచేయి సాధించింది. ఈ జిల్లాలో తొలి విడతలో 163 పంచాయతీలకుగాను 16 ఏకగ్రీవం కాగా, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు 75 సర్పంచ్ సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ మద్దతిచ్చిన వారు 60 సీట్లలో మాత్రమే గెలిచారు. ఇక్కడ బీజేపీకి 11 స్థానాలు దక్కగా, ఇతరులు 17 స్థానాలను దక్కించుకున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గం ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో మాత్రం కాంగ్రె్‌సది పైచేయి అయింది. ఆ జిల్లాలో 42 చోట్ల కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధిస్తే 30 చోట్ల బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిచారు. ఇక తొలి విడతలో 395 గ్రామాల్లో ఎన్నికలు ఏకగ్రీవం కాగా, వీటిలో 90 శాతానికి పైగా కాంగ్రె్‌సకే దక్కాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

