LOCAL WAR: మూడు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు

తెలంగాణలో పంచాయతీ రాజ్ సంస్థల ఎన్నికలు డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో మూడు దశలుగా జరిగే అవకాశం ఉంది. నోటిఫికేషన్ ఈ నెలా 26 లేదా 27న ప్రకటించనున్నారు. పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు ఫ్రీజ్ కావడంతో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. బీసీ రిజర్వేషన్ల వివాదం కారణం ఇప్పటి వరకూ ఆలస్యం అవుతూ వస్తున్నాయి. మొదటి దశ (డిసెంబర్ 11)లో 4,000కు పైగా గ్రామ పంచాయతీలు, 100 MPTCలు కవర్ అవుతాయి. రెండవ దశ (డిసెంబర్ 14)లో మరో 4,000 పంచాయతీలు, మూడవ దశ (డిసెంబర్ 17)లో మిగిలిన 4,769 పంచాయతీల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. మొత్తంగా 12,769 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు 1.67 కోట్ల మంది ఓటర్లు అర్హులు, 1 లక్షకు పైగా అభ్యర్థులు పోటీ పడవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు 2020 అక్టోబర్లో జరగాల్సినప్పటికీ, BC రిజర్వేషన్ వివాదాలోత ఆలస్యమయ్యాయి. ఆర్టికల్ 243E ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఎన్నికలు జరపాల్సినప్పటికీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చి మాత్రమే ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం పట్టుదల చూపింది. అయితే హైకోర్టు జూన్ 2025లో "సెప్టెంబర్ 30 వరకు పూర్తి చేయాలి" అని ఆదేశించింది. అయితే, BC కమిషన్ నివేదికలు, 42% BC కోటా వివాదాలు, సెప్టెంబర్ 2025లో ప్రకటించిన పాత షెడ్యూల్ పై హైకోర్టు స్టే ఇచ్చింది.
ఓటర్ సవరణకు షెడ్యూల్
పంచాయతీల్లో ఓటరు జాబితా మరోసారి సవరణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) బుధవారం షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రోజు అంటే.. గురువారం నుంచి నవంబర్ 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయించింది. 20వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, తప్పుల సవరణ చేయనుంది. 21వ తేదీన ఓటర్ల దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరిస్తుంది. 23వ తేదీన ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ప్రచురణ ఉంటుందని రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) రాణి కుముదిని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. దీంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మరింత ఊపందుకుంది.
ప్రజా పాలన వారోత్సవాల తర్వాతే...
డిసెంబర్ 1 నుంచి 9 వ తేదీ వరకు ప్రజా పాలన వారోత్సవాలు జరుగుతాయి. ఆ తర్వాత ఈ ఎన్నికల నిర్వహించాలని ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో సీఎం రేవంత్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ ప్రక్రియపై రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ, రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించాయి. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తేనే.. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. తాజా క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి "గ్రామ పంచాయతీలు మాత్రమే డిసెంబర్లో జరుగుతాయి, MPTC/ZPTCలు కోర్టు తీర్పు తర్వాత" నిర్వహించాలని నిర్ణయించారు. పంచాయతీలకు రావాల్సిన మూడువేలకోట్ల నిధులు ఆగిపోకుండా పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటున్నారు. ప్రజాపాలన వారోత్సవాలు తొమ్మిదో తేదీతో పూర్తవుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

