LOCAL WAR: సర్పంచ్‌గా పోటీకి వీరు మాత్రమే అర్హులు

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగంది. రాష్ట్ర ఎన్నికల సంఘం సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక కోసం షెడ్యూల్ ప్రకటించింది. మెుత్తం మూడు విడతల్లో డిసెంబర్ 11,14,17 తేదీల్లో ఎన్నికలు జరగనుండగా.. తొలి విడత నామినేషన్ల స్వీకరణ నేటి నుంచి ప్రారంభం కానుంది. దీంతో ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆశావాహులు సిద్ధమయ్యారి. సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలి..?
* గ్రామ సర్పంచ్ స్థానానికి పోటీ చేయాలనుకునే సదరు వ్యక్తి గ్రామపంచాయతీలో స్థానికుడై ఉండాలి. అందుకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అవసరం
* పోటీ చేయదలచిన అభ్యర్తి పేరు పంచాయతీ ఓటింగ్ లిస్టులో నమోదై ఉండాలి.
* సర్పంచ్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసే సమయానికి అభ్యర్థి వయసు 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ఆధార్, బర్త్ సర్టిఫికేట్లు అవసరం
* రిజర్వ్ చేసిన స్థానాల్లో సంబధిత రిజర్వ్‌డ్ అభ్యర్థులకే అవకాశం. అందుకు క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం ఉంటుంది.
* ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ అభ్యర్థులు జనరల్ కేటగిరి నుంచి కూడా పోటీ చేయడానికి ఆస్కారం ఉంది.
* మహిళలు వారికి రిజర్వు చేసిన స్థానాలతో పాటు అదే కేటగిరిలోని జనరల్ స్థానాల్లోనూ పోటీ చేయవచ్చు.
* ఇక ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేయటంతో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేయటానికి అర్హులే.
రిజర్వేషన్‌తో జాక్‌పాట్
స్థానిక సంస్థల ఎన్నికలు ఓ నిరుపేద కుటుంబానికి ఊహించని అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. రిజర్వేషన్ల పుణ్యమా అని ఒకే కుటుంబానికి సర్పంచ్‌తో పాటు రెండు వార్డు మెంబర్ల పదవులు దక్కనున్న ఆసక్తికర ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఈ పరిణామం జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బషీరాబాద్ మండలం మతన్గౌడ్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవిని ఈసారి ఎస్టీ అభ్యర్థికి రిజర్వ్ చేశారు. అయితే, 494 మంది ఓటర్లు ఉన్న ఆ గ్రామంలో ఎరుకల భీమప్ప కుటుంబం మాత్రమే ఏకైక ఎస్టీ కుటుంబం. దీంతో సర్పంచ్ పదవి భీమప్ప కుటుంబానికే దక్కడం ఖాయమైంది. చీపుర్లు, బుట్టలు అల్లుకుంటూ భార్య వెంకటమ్మతో కలిసి భీమప్ప జీవనం సాగిస్తున్నారు. కేవలం సర్పంచ్ పదవే కాకుండా, ఎస్టీ జనరల్, ఎస్టీ మహిళకు రిజర్వ్ చేసిన రెండు వార్డు స్థానాలు కూడా వీరి కుటుంబానికే దక్కనున్నాయి. భీమప్పకు ఇద్దరు కుమారులు ఎల్లప్ప, మహేశ్, కోడళ్లు సప్న, సుజాత ఉన్నారు. కుమారులు ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. గ్రామంలో వేరే ఎస్టీ కుటుంబం లేకపోవడంతో ఈ మూడు పదవులు ఏకగ్రీవంగా భీమప్ప కుటుంబానికే దక్కనున్నాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలు వారి కుటుంబ ఆర్థిక పరిస్థితులను పూర్తిగా మార్చేస్తాయని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

