Telangana: కీలకంగా నిజామాబాద్ లోక్‌సభ స్థాసం

Telangana: కీలకంగా నిజామాబాద్  లోక్‌సభ స్థాసం
ఓట్లను చీల్చేందుకు కుల రాజకీయాలు

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని పార్టీలు కీలకంగా తీసుకున్నాయి. ఈ సీటు దక్కించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నాయి. భాజపా సిట్టింగ్‌ స్థానాన్ని కైవసం చేసుకోవాలని భారాస, కాంగ్రెస్‌ భావిస్తున్నాయి. ఇప్పటికే భారాస అదే సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని నిలిపి కుల రాజకీయానికి తెరలేపింది. సిట్టింగ్‌ మున్నూరు కాపు కావడంతో ఆ వర్గం ఓట్లను చీల్చేందుకు భారాస ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్‌ సైతం అదే సామాజిక వర్గం వ్యక్తిని నిలపాలని భావించినా.. ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోంది. ఓట్లను చీల్చేందుకు కుల రాజకీయం చేస్తున్న భారాస, కాంగ్రెస్‌ల ప్రయత్నం ఫలించబోదని భాజపా భావిస్తోంది.

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానంలో భాజపా తరపున సిట్టింగ్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మరోసారి బరిలో నిలుస్తున్నారు. భారాస తరపున ఇటీవల ఎన్నికల్లో నిజామాబాద్‌ రూరల్‌ స్థానంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఆ పార్టీ ప్రకటించింది. అయితే ఈ ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం మున్నూరు కాపు కావడం విశేషం. గత పార్లమెంట్‌ ఎన్నికల్లో మొదటి సారి పోటీ చేసిన DS తనయుడు ధర్మపురి అర్వింద్‌.. అప్పటి సిట్టింగ్‌ MP కవితను ఓడించారు. ఇప్పుడు సిట్టింగ్‌ను ఎలాగైనా ఓడించాలన్న ఉద్దేశంతో భారాస అభ్యర్థిని ఎంపిక చేసింది. అర్వింద్‌ మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో అదే సామాజికవర్గానికి చెందిన బాజిరెడ్డి గోవర్ధన్‌ను బరిలోకి దించింది. కులం ఓట్లను చీల్చి.. ప్రయోజనం పొందేందుకే భారాస ఈ ఎత్తుగడ వేసిందన్న వాదన వినిపిస్తోంది.

బాజిరెడ్డి గోవర్ధన్‌.. ఇటీవల భారాస తరపున నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వరుసగా రెండు సార్లు గెలిచిన బాజిరెడ్డి గోవర్ధన్.. ఇటీవలి ఎన్నికల్లో ఓడిపోయారు. గతంలో బాన్సువాడ, ఆర్మూర్‌ నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే మొదట్నుంచీ DS కుటుంబానికి, బాజిరెడ్డి కుటుంబానికి మధ్య రాజకీయ వైరం ఉంది. DS... PCCగా ఉన్నప్పుడు ఎదుర్కొనేందుకు అదే కులానికే చెందిన బాజిరెడ్డిని భారాసలోకి తీసుకొచ్చారని అంటారు. ఇప్పుడు మరోసారి అదే ప్రయోగం చేస్తోంది భారాస. మున్నూరు కాపు ఓట్లను చీల్చడానికే ఆ సామాజికవర్గం నుంచి బాజిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే ఎంత మేర ప్రయోగం ఫలిస్తుందోనన్న అనుమానం లేకపోలేదు. అయితే గత ఆరేళ్లలో నిజామాబాద్‌ పార్లమెంటు పరిధిలో భాజపా బలపడిందని.. అదే తమకు కలిసి వస్తుందని సిట్టింగ్‌ MP అర్వింద్‌ అంటున్నారు.

మున్నూరు కాపు ఓట్లను చీల్చాలని ఆ సామాజిక వర్గానికి చెందిన బాజిరెడ్డిని బరిలోకి దింపడంతో భారాస కుల రాజకీయానికి తెర లేపిందని ఆ వర్గం నాయకులు మాట్లాడుకుంటున్నారు. దీనివల్ల ఇతర కులాలకు చెందిన ఓటర్లు దూరమయ్యే అవకాశమూ ఉందని అంటున్నారు.


Tags

Read MoreRead Less
Next Story