RAINS: లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఎల్లో అలెర్ట్‌ జారీ

RAINS: లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఎల్లో అలెర్ట్‌ జారీ
X
చాలా ప్రాంతాల్లో అలుముకున్న చీకట్లు... ప్రజల ఇబ్బందులు

హైదరాబాద్‌లో నిన్నటి నుంచి వర్షం దంచికొడుతునే ఉంది. భారీ వర్షంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భాగ్యనగరానికి జీహెచ్ఎంసీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. చాలాచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాగా, హైదరాబాద్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. సిటీలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్‌పేట్, సోమాజిగూడ, ఫిలింనగర్, షేక్‌పేట్, మెహిదీపట్నం, సనత్ నగర్, కూకట్‌పల్లి, మూసాపేట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్, ముషీరాబాద్, చిక్కడపల్లి , రాంనగర్, అశోక్ నగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట, LB నగర్, హయత్‌నగర్, సికింద్రాబాద్, రసూల్‌పురా, బోయిన్‌పల్లి, మేడ్చల్, కుత్బుల్లాపూర్, చింతల్, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక, మల్కాజిగిరిలో భారీ వర్షం కురుస్తోంది. వర్షం ధాటికి పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో భాగ్యనగరం అంధకారంలో నెలకొంది.

లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బల్దియా హెచ్చరించింది. ఈరోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. మరోవైపు వాతావరణశాఖ హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. ఏదైనా సమస్య తలెత్తితే 040-21111111, 9000113667 నంబర్లకు కాల్‌ చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులు సూచించారు. పలుచోట్ల జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇవాళ కూడా తెలంగాణలో వర్షాలు కురవనున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మధ్య తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు గట్టి జల్లులు పడే అవకాశముందని తెలిపింది. హైదరాబాద్‌లో ఎడతెరపిలేని వర్షాలు కురుస్తుండడంతో జలమండలి అప్రమత్తమైంది. జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ఉన్నతాధికారులు, జీఎం, డీజీఎం, మేనేజర్‌లతో సమీక్ష నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటించాలని ఆదేశించారు. వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈఆర్టీ, ఎస్పీటీ టీమ్‌లు సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ముంపు ప్రాంతాల్లో నీటి నాణ్యత పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వీలైన ప్రాంతాల్లో క్లోరిన్ బిళ్లల పంపిణీ చేయాలని సూచించారు.

కలుషిత నీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆదేశించారు. పని ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేయాలని అన్నారు. మ్యాన్‌హోళ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ తెరవొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే కస్టమర్ కేర్ నెంబర్ 155313కి ఫోన్ చేయాలని సూచించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని వివరించారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story