L&T : హైదరాబాద్ మెట్రో ప్రాజెక్టు నుంచి తప్పుకునేందుకు ఎల్&టీ సిద్ధం..?

హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్వహణపై ఎల్&టీ సంస్థ, తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం మరింత ముదురుతోంది. ప్రాజెక్టు నిర్వహణ నుంచి తప్పుకుంటామని, దానికి బదులుగా తమకు రూ. 6,000 కోట్లు చెల్లించాలని ఎల్&టీ ఇటీవల ప్రభుత్వానికి లేఖ రాయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రతిపాదనపై ప్రభుత్వం తీవ్రంగానే ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
గత కొంతకాలంగా హైదరాబాద్ మెట్రో నిర్వహణ లాభదాయకంగా లేదని, అప్పులు, వడ్డీల భారం పెరిగిపోయిందని ఎల్&టీ సంస్థ పదేపదే ప్రభుత్వానికి తెలుపుతూ వస్తోంది. అయితే ప్రాజెక్టు మొదటి దశలో తమకు అప్పగించిన ఆస్తులను సమర్థవంతంగా నిర్వహించడంలో ఎల్&టీ విఫలమైందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా మెజారిటీ మెట్రో స్టేషన్లలో పార్కింగ్ సౌకర్యం లేకపోవడం వల్ల ప్రయాణికుల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగలేదని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ప్రభుత్వానికే అప్పగించే యోచన. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మెట్రో రెండో దశ విస్తరణను పూర్తిగా ప్రభుత్వమే చేపడుతుందని ప్రకటించారు. సుమారు రూ. 40 వేల కోట్లకు పైగా వ్యయంతో భారీ విస్తరణకు సిద్ధమవుతున్న తరుణంలో, మొదటి దశ నిర్వహణ బాధ్యతలను కూడా స్వీకరించడం ప్రభుత్వానికి పెద్ద కష్టమేమీ కాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎల్&టీ ప్రాజెక్టు నుంచి వైదొలగాలని నిర్ణయించుకుంటే, దానిని అంగీకరించడానికే ప్రభుత్వం మొగ్గు చూపుతోంది.
ఒకే గొడుగు కింద మొత్తం ప్రాజెక్టు. రెండు మెట్రో దశల మధ్య సమన్వయం, అనుసంధానం మెరుగ్గా సాగాలంటే మొత్తం ప్రాజెక్టు ఒకే గొడుగు కింద, అంటే ప్రభుత్వ నియంత్రణలో ఉండటం మేలని ప్రభుత్వంలో చర్చ జరుగుతోంది. ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి దేశంలోని ఇతర ప్రధాన నగరాల్లో ప్రభుత్వాలే మెట్రోలను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులు కొన్నిసార్లు నష్టాలను చవిచూస్తున్నప్పటికీ, వాటిని ప్రజలకు అందించే రవాణా సేవలో భాగంగానే ప్రభుత్వాలు చూస్తున్నాయి.
హైదరాబాద్ మెట్రోను కూడా ప్రభుత్వమే నడిపేందుకు అవసరమైతే ఒక ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసి నిధులు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ ప్రతిపాదనను ప్రభుత్వం స్వయంగా ముందుకు తీసుకురాకుండా, ఎల్&టీ నుంచి అధికారికంగా ఒత్తిడి వస్తేనే అందుకు ఆమోదం తెలపాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com