TG : వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ

వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సూచించారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన దక్షిణ కాశీగా పేరుపొందిన వేములవాడ రాజన్న ఆలయానికి మహర్దశ పట్టనుంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవస్థానం అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ అమలు చేయనున్నట్లుగా మంత్రి ప్రకటించారు. సచివాలయంలో దేవాదాయ శాఖ పేషీ కాన్ఫరెన్స్ హాలులో మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే కవ్వపల్లి సత్యనారాయణ, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, కమీషనర్ హనుమంతు, వేములవాడ ఈవో వినోద్‌తో కలిసి మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వేములవాడ ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై, మాస్టర్ ప్లాన్ అమలుపై సమగ్రంగా చర్చించారు. సమీక్షా సమావేశం అనంతరం మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. వేములవాడ ఆలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించినట్టు తెలిపారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో చర్చించనున్నట్టు పేర్కొన్నారు. వేములవాడలో మాస్టర్ ప్లాన్ అమలు చేసి.. సరికొత్త శోభను తీసుకొచ్చేందుకు కృషి చేయనున్నట్టు మంత్రి కొండా సురేఖ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com