TG : మహేశ్ కుమార్ గౌడ్ కూడా గజనీ లెక్క తయారైండు ; బండి సంజయ్

తెలంగాణ పీసీసీ అధ్యక్షులు మహేశ్ గౌడ్ పై తనకు వ్యక్తిగత కక్ష లేదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. దొంగ ఓట్లతో బీజేపీ నేతలు గెలిచారంటూ మహేశ్ కుమార్ గౌడ్ చేసిన ఆరోపణలపై బండి సంజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ఆయన ఏం మాట్లాడారో ఆయనకే తెలియనట్లుంది. ఒక్కసారైనా వార్డు మెంబర్ గానో, ప్రజాప్రతినిధిగానో గెలిచి ఉంటే ఓట్ల చోరీ సంగతి తెలిసేది. ఆయన ఒక్కసారి కూడా వార్డు మెంబర్ గా కూడా గెలవని వ్యక్తి. ఓట్ల చొరీ సంగతి ఆయనకేం తెలుసు? కరీంనగర్ లో ఒక ఓటు వేసి జగిత్యాలలో మరో ఓటు చొప్పదండిలో ఇంకో ఓటు వేయడం సాధ్యమైతదా? ఆయన ఎట్లా మాట్లాడతారు? నన్ను కరీంనగర్ ప్రజలు 2 లక్షల 25 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించారు. ఆయనేమో దొంగ ఓట్లతో గెలిచారని చెప్పి కరీంనగర్ ప్రజలను అవమానిస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా. అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే కదా. దొంగ ఓట్ల జాబితాను బయటపెట్టి వాటిని తొలగించాలని ఎలక్షన్ కమిషన్ కు లేఖ రాయండి. ఆ తరువాత అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్దాం. ఒకవేళ కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. కాంగ్రెస్ నేతలు ఊళ్లలోకి పోతే రాళ్లతో కొట్టేంత కోపంతో జనం ఉన్నారు. గ్రామ పంచాయతీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క పైసా అయినా ఇచ్చిందా? నాకు తెలిసినంత వరకు 20 నెలల పాలనలో పంచాయతీలకు ఒక్కపైసా కూడా ఇయ్యని పార్టీ కాంగ్రెస్ పార్టీ. రేపు పంచాయతీ ఎన్నికలు సైతం కేంద్ర నిధుల కోసమే నిర్వహిస్తున్నారే తప్ప ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనే కాంగ్రెస్ కు లేదు. పంచాయతీలకు నిధులు ఇస్తోంది కేంద్ర ప్రభుత్వమేనని బండి సంజయ్ అన్నారు. మహేశ్ గౌడ్ ను చూస్తే గజిని సినిమా గుర్తుకొస్తుంది. హీరోకు 15 నిమిషాలకు మించి ఏధీ గుర్తుండదు. మహేశ్ గౌడ్ కూడా గజనీ లెక్క తయారైండు. ఆయనే నన్ను బీసీ అన్నడు. బండి సంజయ్ బీసీ కాబట్టే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించారని మాట్లాడిండు. ఇప్పుడు మళ్లీ ఆయనే నన్ను దేశ్ ముఖ్ అని అంటున్నడు. ఆయన ఏం మాట్లాడుతున్నడో ఆయనకే అర్ధం కావడం లేదు. బీసీ అంటూ బీసీ నాయకుడినే విమర్శిస్తారు. బీసీ రిజర్వేషన్ల అని చెప్పి ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తారు. బీసీని ఉప రాష్ట్రపతి చేస్తే ఆయనను ఓడగొట్టాలని చూస్తరు. ఓడిపోతారని తెలిసి రెడ్డి అభ్యర్ధిని ఉపరాష్ట్రపతి బరిలో దింపుతున్నారు. చివరకు ఆ సామాజికవర్గం వాళ్లు కూడా కాంగ్రెస్ ను తిడుతున్నరని సంజయ్ మండిపడ్డారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com