TG: ఊపందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం

TG: ఊపందుకున్న ఎమ్మెల్సీ ప్రచారం
ఎమ్మెల్సీ ఉపఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ ప్రధాన పార్టీల ముమ్మర ప్రచారం

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల MLC ఉపఎన్నికల సమయం సమీపిస్తున్న వేళ... ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. 3 ఉమ్మడి జిల్లాల్లో ఆయా పార్టీల నాయకులు సన్నాహక సమావేశాలతో తమదైన శైలిలో ఓట్లవేట కొనసాగిస్తున్నారు. నిరుద్యోగ, ఉద్యోగ, పట్టభద్రుల సమస్యలపై పోరాడే వ్యక్తులను.. MLCగా ఎన్నుకోవాలని కోరుతున్నారు. పట్టభద్రుల MLC ఉపఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారీ మెజార్టీ సాధించేందుకు బీఆర్‌ఎస్‌ పావులు కదుపుతోంది. వడ్లకు 500 బోనస్‌ ఇస్తామని ప్రకటించి..ఇప్పుడు మాట మార్చి రైతులను మోసం చేసిన కాంగ్రెస్‌కు పట్టభద్రులే... తగిన బుద్ధి చెప్పాలని ఖమ్మంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్‌ విజ్ఞప్తి చేశారు.


హామీలు అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాలంటే ప్రతిపక్షం... బలంగా ఉండాలని... అందుకే పట్టభద్రులంతా ప్రశ్నించే గొంతుకగా ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్‌ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ సహా హాలియాలో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మే ళనంలో పాల్గొన్న కేటీఆర్‌.. అమలుకు సాధ్యం కానీ హామీలతో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మాయ మాటలు చెప్పే...వారిని... పెద్దల సభకు పంపవద్దని... విద్యావంతులనే.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు.

మాజీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టభద్రులను గౌరవించకుండా.. అవమానపరిచారని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమానందర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా ప్రజలను మోసం చేస్తున్నారన్న ఆయన.. పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. MLC ఉపఎన్నికలకు ప్రచార గడువు దగ్గరపడంతో.. సన్నాహక భేటీలతో పట్టభద్రులను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు నిమగ్నమయ్యారు.


Tags

Next Story