Old City : పాతబస్తీలో అదానీ విద్యుత్ బిల్లుల వసూలుపై మజ్లిస్ అభ్యంతరం

హైదరాబాద్ పాతబస్తీలో అదానీ గ్రూపుకు అప్పగించిన విద్యుత్ బిల్లుల సేకరణ పైలట్ ప్రాజెక్టు తమ పార్టీ వ్యతిరేకిస్తోందని ఎంఐఎం నాంపల్లి ఎమ్మెల్యే మొహమ్మద్ మాజిద్ హుస్సేన్ ప్రకటించారు. పాతబస్తీలో అదానీ కంపెనీకి విద్యుత్ బిల్లుల సేకరణ బాధ్యతలను అప్పజెప్పడంతో పాటు విద్యుత్ ప్రాజెక్టుల పేరుతో జెన్ కో, ట్రాన్స్ కో తదితర డిస్కమ్ ల ప్రైవేటీకరణపై ఆయన మండిపడ్డారు.
విద్యుత్ బిల్లుల ప్రైవేటీకరణను ఖండిస్తున్నామన్నారు మాజిద్ హుస్సేన్. విద్యుత్ అధికారులను ఓల్డ్ సిటీ ప్రజలు అదానీ గ్రూప్ గా అభివర్ణిస్తున్నారన్నారు. ఓల్డ్ సిటీ అనంతరం హైదరాబాద్ బాధ్యతలు అప్పగించి, తదనంతరం రాష్ట్రవ్యాప్తంగా అదానికే అప్పగిస్తామని సీఎం చెప్పడాన్ని ఆయన ఖండించారు. సేకరించిన విద్యుత్ బిల్లుల్లో 25 శాతం అదానికి, 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలంటున్న నిర్ణయంతో రాష్ట్రానికి నష్టం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తన మ్యానిఫెస్టోలో ఇచ్చిన ఆరు హామీలు, ఇతర వాగ్దానాలను అమలు చేసేందుకు వీలుగా వనరులను సృష్టించు కోవాలని మాజిద్ హుస్సేన్ సూచించారు. అలాగే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సరైన వాటాను తీసుకువచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి ఎంఐఎం సంపూర్ణ మద్దతునిస్తుందని ప్రకటించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com