తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు!

తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు!
ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఉదయాన్నే ఆడపడుచులు రంగవల్లుల వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివెరిస్తోంది.

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలుగు లోగిళ్లు రంగవల్లులతో కలకళలాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో ఉదయాన్నే ఆడపడుచులు రంగవల్లుల వేసి సంక్రాంతికి స్వాగతం పలుకుతున్నారు. పల్లెల్లో సంక్రాంతి పండుగ శోభ వెల్లివెరిస్తోంది. బంధు మిత్రులతో పల్లెలు సందడిగా కనిపిస్తున్నాయి అమ్మాయిలు పట్టు పరికిణీలు, లంగాఓణి ధరించి తెలుగింటి సంప్రదాయాన్నిచాటి చెబుతున్నారు.

తెలుగువారికి అసలైన పెద్ద వేడుక సంక్రాంతి. ఎక్కడున్నా అందరూ ఒక్క చోటికి చేర్చి సందడిగా మార్చే సిసలైన పండుగ ఇది. మూడు రోజుల పండుగలో భాగంగా ఇప్పటికే భోగీ సందడి ముగిసింది. ఇక పెద్దపండగైన సంక్రాంతిని అంతా ఒక్కటై జరుపుకుంటున్నారు తెలుగు ప్రజలు. పచ్చని పొలాల మాటున మంచు తెరలను చీల్చుకుంటూ దక్షణాయనం పయనించి ఉత్తరాయనం దిశగా గమనం మార్చుకునే సూర్యభగవానుడికి ప్రజలంతా స్వాగతం పలికారు.

సంక్రాంతి పండగతో తెలుగు రాష్ట్రాల్లోని పల్లెలన్ని మురిసిపోతున్నాయి. ఇళ్ల ముందు రంగవల్లులు, ఇంటి లోపల పిండివంటలు, ఆకాశంలో గాలిపటాలు, బసవన్నల ఆటలు, హరిదాసుల పాటలతో గ్రామాలు సందడిగా మారాయి. మొత్తంగా తొలుగు లోగుళ్లు కొత్త కళను సంతరించుకున్నాయి.

ముంగిళ్లు ముగ్గులతో కళకళలాడితే.. బరుల్లో కోళ్లు దుమ్మురేపాయి. ఇక హరినామస్మరణతో సంక్రాంతికి పల్లెల్లో ఇంటింటికీ తిరుగే హరిదాసులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు. మూడు నామాలు పెట్టుకుని, నెత్తిన అక్షయపాత్ర, చేతిలో వీణ మరో చేతిలో చెక్క భజనతో హరిలో రంగ హరీ అంటూ గ్రామాల్లో సందడి చేస్తున్నారు. హరిదాసుల రాకతో గ్రామాల్లో సంక్రాంతి శోభ నెలకొంది.

ఇక సంక్రాంతి పండుగలో మరో ప్రత్యేకత డూడూ బసవన్నలు. గ్రామాల్లో పండుగవేళ గంగిరెద్దులు చేసే విన్యాసాలు చూసి ప్రజలు సంబరపడిపోతారు. ప్రత్యేక అలంకరణ చేసిన గోమాత బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను కూడా తీసుకుని వస్తుందని ప్రజల విశ్వాసం. గోమాత ముఖంపైనే ఆముగ్గురు దేవుళ్లు ప్రత్యక్షమవుతారనీ ప్రతీతి. గోవుకు చేసే దానం ధర్మంగా పరిగణిస్తారు. డూడూ బసవన్నలకు వస్త్రాలుదానంగా ఇచ్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సంక్రాంతి వేళ అయ్యగారికి దండం పెట్టు.. అమ్మగారికి దండం పెట్టు..!అంటూ డూడూ బసవన్నలతో గంగిరెద్దులు సందడి చేస్తున్నాయి.

సంక్రాంతి పండగంటే.. బోగిమంటలు, గొబ్బి ఆటలు, కోడిపందాలు, గంగిరెద్దులే కాదు.. ముఖ్యమైనది మరోటుంది.. అదే పిండివంటలు. అమ్మమ్మ, బామ్మలు చేసిన నోరూరించే పిండి వంటల్ని కడుపారా లాగించేసి బంధువులతో ఆప్యాయత, అనురాగాల పంచుకోవడంలో ఉన్న ఆనందమే వేరు. పెద్దవాళ్లకు పండగంటే.. కోడిపందాలు.. కానీ పిల్లలు పండగంటే పిండివంటలే.. సంక్రాంతి వచ్చిందంటే ఎన్నో రుచికరమైన రకరకాల పిండివంటలు సిద్ధమైపోతాయి. అమ్మమ్మ, నానమ్మలు చేసే అప్పాలు.. అరిశెలు, గారెలు, బూరెలు కళ్ల ముందు కనబడితే చాలు లాగించేయాలనిపిస్తుంది. సంక్రాంతి అంటే గుర్తొచ్చేవి సకినాలు. తెలంగాణ జిల్లాల్లో సంక్రాంతికి పది రోజుల ముందే ఇంటింటా సకినాల ఘుమఘుమలు గుబాళిస్తాయి.

Tags

Read MoreRead Less
Next Story