Tiger : ఆసిఫాబాద్ జిల్లాలో ఆచూకీ దొరకని పెద్దపులి..గ్రామస్తుల్లో భయాందోళన
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పులి దాడి కలకలం సృష్టిస్తోంది. గత కొన్నిరోజులుగా పశువుల మందలపై దాడులు చేస్తున్న పులి.. శుక్రవారం ఓ యువతిని చంపేసింది. కాగజ్‌నగర్ మండలం గన్నారంలో పత్తి ఏరుతున్న మోర్లె లక్ష్మిపై దాడి చేసింది. అటవీ శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. దాడి జరిగిన ప్రాంతానికి దగ్గరలోనే పులి సంచరిస్తున్నట్లు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో కాగజ్‌నగర్ మండలంలోని పలు గ్రామాల్లో ఆంక్షలు విధించారు. ఈజ్గామ్, నజ్రూల్ నగర్, సీతానగర్, అనుకోడా, గన్నారం, కడంబా, ఆరెగూడ, బాబూనగర్, చింతగూడ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఆయా గ్రామాల ప్రజలు పంట చేలకు, అటవీ ప్రాంతాలకు వెళ్లకుండా 144 సెక్షన్ విధించారు. దాడి చేసిన చోటుకే పులి మళ్లీ వచ్చే అవకాశం ఉందని, అటువైపు ఎవ్వరూ వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com