TG : సీఎం రేవంత్ వైఖరితో మాదిగ నిరుద్యోగులకు అన్యాయం : మందకృష్ణ మాదిగ

ఉద్యోగ నోటిఫికేషన్ విషయంలో మాదిగ నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఉద్యోగాల్లో వర్గీకరణ ఫలాలు మాదిగలకు దూరం కావడానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ కారణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం ప్రెస్ క్లబ్ లో విలేకరులతో మాట్లాడారు. ముప్పై ఏళ్ళ పోరాట ఫలమైన వర్గీకరణ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం హర్షించదగిందన్నారు. రిజర్వేషన్లు మాదిగలకు దక్కకుండా కాంగ్రెస్ చేసిన కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్తామని నొక్కి చెప్పారు. సీఎం, దామోదర వల్లనే మాదిగలకు ద్రోహం జరిగిందన్నారు. రేవంత్ రెడ్డి స్థానంలో ఏ సీఎం ఉన్నా.. ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే.. దామోదర్ రాజనర్సింహకాకపోతే వేరే ఏ మంత్రి అయినా వర్గీకరణ బిల్లు పెట్టాల్సిందేనన్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్గీకరణ జరిగితీరాల్సిందేనని తేల్చిచెప్పారు. ఎస్సీ వర్గీకరణ జరగక ముందే వేలాది ఉద్యోగాలు రేవంత్ రెడ్డి మాలలకు దోచి పెట్టాడని మండిపడ్డారు. సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన గత నోటిఫికేషన్లకు రిజర్వేషన్లు ఎందుకు వర్తింపజేయలేదని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణలోని మూడు గ్రూపుల్లో లోపాలు ఉన్నాయని అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడాయని, ఎమ్మార్పీఎస్ లేవనెత్తిన అంశాల్లో న్యాయం ఉందని అసెంబ్లీలో జరిగిన చర్చే రుజువన్నారు. కానీ.. లోపాలపై ప్రభుత్వం ఎలాంటి వివరణ ఇవ్వకపోవటం దుర్మార్గమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com