Lulu International Company : మంజీరా మాల్‌ను లులు ఇంటర్నేషనల్ సంస్థ సొంతం

కూకట్‌పల్లిలోని మంజీరా మాల్‌ను లులు ఇంటర్నేషనల్ సంస్థ సొంతం చేసుకుంది. మంజీరాపై 49 సంస్థలు ఆసక్తి చూపగా చివరికి 7 మాత్రమే పోటీలో నిలిచాయి. దివాలా పరిష్కార ప్రక్రియ ద్వారా రూ.318 కోట్లకు లులు కొనుగోలు చేసింది. మంజీరా మాల్ నిర్మాణానికి చేసిన అప్పులు చెల్లించలేక పారిశ్రామికవేత్త యోగానంద్ 2023లో దివాలా పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మంజీరాలోనే లులు మాల్ అద్దెకు ఉంటోంది. మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్ తమవద్ద తీసుకున్న అప్పులు తిరిగి చెల్లించకపోవడంతో కేటలిస్ట్ ట్రస్టీషిప్ గత ఏడాది జులైలో ఎన్‌సీఎల్‌టీని ఆశ్రయించింది. దీన్ని ఎన్‌సీఎల్‌టీ అనుమతించడంతో పాటు దివాలా ప్రక్రియ నిర్వహించడానికి బీరేంద్ర కుమార్ అగర్వాల్‌ను రిజల్యూషన్ ప్రొఫెషనల్‌గా నియమించింది. ఆ తర్వాత బిడ్లు పిలవడం, ఆసక్తి గల సంస్థలతో సంప్రదింపులు సాగించడం, సీఓసీ సమావేశాలు నిర్వహించడం వంటి ప్రక్రియలను పూర్తి చేశారు. ఈ దశలన్నీ అధిగమించి లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్, మంజీరా రిటెయిల్ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకుంది. కేపీహెచ్‌బీలోని మంజీరా మాల్‌ను కొంతకాలం క్రితం లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ లీజుకు తీసుకున్న విషయం విదితమే. ఇప్పుడు దీనికి యజమానిగా మారిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com