Revanth Reddy : మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వాలి - సీఎం రేవంత్‌రెడ్డి

ఆదివాసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ములుగు జిల్లాలోని మేడారం సమ్మక్క-సారలమ్మ ఆలయ అభివృద్ధి పనులపై సమీక్షించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని, ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. "కుంభమేళాకు వేల కోట్లు ఇస్తున్న కేంద్రం.. ఆదివాసుల కుంభమేళా అయిన మేడారం జాతరకు మాత్రం ఎందుకు నిధులు ఇవ్వడం లేదు?" అని ఆయన ప్రశ్నించారు. ఈ ఆలయ అభివృద్ధి ఒక బాధ్యతతో కూడిన భావోద్వేగమని, ఈ పనులతో మంత్రి సీతక్కతో పాటు తన జన్మ ధన్యమైనట్లేనని సీఎం పేర్కొన్నారు.
ఆలయ అభివృద్ధిపై సీఎం హామీలు ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా రాతి కట్టడాలతో శాశ్వత ప్రాతిపదికన ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. రాబోయే వంద రోజుల్లో పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. మహాజాతర నాటికి ఈ పనులు పూర్తవుతాయని చెప్పారు. ఆలయ నిర్మాణంలో స్థానిక ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలను భాగస్వాములను చేస్తామన్నారు. స్థానికుల అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు. జంపన్న వాగులో నీరు నిల్వ ఉండేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.
2023 పాదయాత్రను గుర్తుచేసుకున్న సీఎం సమ్మక్క-సారలమ్మల ఆశీస్సులతోనే ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని రేవంత్‌రెడ్డి అన్నారు. 2023 ఫిబ్రవరి 6న ఇక్కడి నుంచే తాను పాదయాత్ర మొదలు పెట్టానని, తెలంగాణకు పట్టిన చీడపీడలను వదిలించేందుకు ఈ గడ్డపై నుంచి అడుగులు వేశామని గుర్తు చేసుకున్నారు. గత పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని, అయితే తమ ప్రభుత్వం ఎన్ని కోట్లు అయినా మంజూరు చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. పోరాటానికి, పౌరుషానికి స్ఫూర్తి సమ్మక్క-సారలమ్మ అని, ఆదివాసీ పోరాట చరిత్రను భవిష్యత్ తరాలకు అందించేలా పనిచేస్తామని సీఎం తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com