TG : తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం

తెలంగాణలో ఇంటర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సీఎం రేవంత్ సూచనలతో ఇంటర్ బోర్డు ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. ప్రభుత్వం అంగీకారం తెలిపితే 2025-26 విద్యా సంవత్సరం నుంచి మధ్యాహ్న భోజనం విద్యార్థులకు అందించనుంది. రాబోయే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించే అవకాశం ఉంది. రాష్ట్రంలో 425 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉండగా, సుమారుగా 1.75 లక్షల మంది చదువుతున్నారు.
ఈ కాలేజీలన్నీ కూడా దాదాపుగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లోనే ఉన్నాయి. దీంతో స్టూడెంట్స్ కాలేజీలకు దూరప్రాంతాల నుంచి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి ఉంది. ఉదయాన్నే భోజనం తెచ్చుకునే వీల్లేని చాలా మంది విద్యార్థులు.. ఆకలితో కాలేజీ సమయం కంటే ముందే ఇళ్లకు వెళ్లిపోతున్నారు. ఈ పరిస్థితి కారణంగా ఇంటర్ కాలేజీల్లో డ్రాపౌట్లు పెరిగిపోతున్నాయి. చాలా కాలేజీల్లో అటండెన్స్ 50 శాతానికి మించడం లేదని విద్యాశాఖ అధికారులు గుర్తించారు.
కాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీలతోపాటు బీఈడీ, డీఈడీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో చదువుతున్న 3.91 లక్షల మందికి మధ్యాహ్న భోజనం అమలు చేయాలని 2018లోనూ అప్పటి సర్కార్ భావించింది. అక్షయ పాత్ర ఫౌండేషన్ ఆధ్వర్యంలో పథకం అమలుకు రంగం సిద్ధం చేశారు. అయితే ఆగస్టు 15న పథకాన్ని ప్రారంభించాలని భావించినా అమలుకు నోచుకోలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com