TG : కాపాడలేకపోయాం .. మంత్రి పొంగులేటి కన్నీళ్లు

అధికారులు సెలవులు పెట్టొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం నాయకన్ గూడెం గ్రామానికి చెందిన యాకూబ్, అతడి భార్య సైదా వరదల్లో చిక్కుకున్నారు. ఇటుక పని చేసుకునే వారిద్దరూ వరదలో కొట్టుకొనిపోయారు. ఆ కుటుంబాన్ని రక్షించేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదంటూ మంత్రి ఆవేదన చెందారు. హైదరాబాద్‌లోని సచివాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన కన్నీరు పెట్టేసుకున్నారు. యాకూబ్ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయిందని సమాచారం అందడంతో వారిని భగవంతుడే కాపాడాలని తెలిపారు. ముగ్గురిలో ఒకరిని కాపాడగలిగామని, అన్ని ఉన్నా వాతావరణం అనుకూలించక రక్షించుకోలేకపోయానంటూ మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. 'ఉదయం నుంచి ఆ కుటుంబాన్ని కాపాడేందుకు చేయని ప్రయత్నం లేదు. హెలికాప్టర్‌ల కోసం ప్రయత్నం చేశాం. భారీ వర్షాలకు హెలికాప్టర్లు టేకాఫ్ కావడం కష్టమన్నారు. ఈక్రమంలో యాకూబ్‌తో పాటు ఆయన భార్య సైదాకు ధైర్యం చెబుతూనే ఉన్నా. డ్రోన్ ద్వారా ప్రయత్నం చేసినా ఫలించలేదు. ఇంతలోనే భారీ వరద పోటెత్తడంతో వారిద్దరూ వరదలో కొట్టుకుపోయారు' అంటూ మంత్రి వాపోయారు. యాకూబ్ కుటుంబాన్ని అన్నివిధాలా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ సంఘటనతో రాష్ట్రంలో ఎవరూ కూడా వరదలు పోటెత్తే ప్రాంతాల్లో ఉండొద్దని సూచించారు. వీలైనంత వరకు ఎత్తైన ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. అధికార యంత్రాంగం కూడా వెంటనే తగిన చర్యలు చేపట్టాలని మంత్రి శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com