TG : త్వరలో అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ : మంత్రి శ్రీధర్ బాబు

కేంద్ర ప్రభుత్వ సహకారంతో త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం కల్పిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ( D. Sridhar Babu ) చెప్పారు. మంగళవారం కరీంనగర్‌లో ప్రజాపాలన దినోత్సవంలో పాల్గొన్న అనంతరం స్థానిక ఆర్‌అండ్‌బీ గెస్టు హౌస్‌లో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు ఫైబర్ నెట్‌వర్క్‌ని విస్తరించి 20 ఎంబీ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ సదుపాయాన్ని అందించాలని ఐటీ శాఖ కృషి చేస్తోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా సంగుపేట, నారాయణపేట జిల్లా మద్దూరు, పెద్దపల్లి జిల్లా అడవి శ్రీరాంపూర్ గ్రామాలను ఫైలెట్‌గా ఎంపిక చేసుకున్నామని, ఈ గ్రామాల్లో పూర్తి స్థాయిలో నెట్‌వర్క్ విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ ఫైలెట్ గ్రామాల్లో ప్రధానంగా కేబుల్ టీవీ సర్వీస్, కేబుల్ వర్చువల్ డెస్క్‌టాప్ కనెక్టివిటీ, 20 ఎంబీ అన్‌లిమిటెట్ ఇంటర్‌నెట్ కనెక్టివిటీ, టెలిఫోన్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఈ మూడు గ్రామాల్లో 360 డిగ్రీస్‌లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించి సీసీ కెమెరాలు అమర్చుతున్నామన్నారు.రెండు నెలల్లో పైలెట్ ప్రాజెక్టు పూర్తి చేసి అక్కడ ఎదురయ్యే మంచి చెడులను, సాంకేతిక పరమైన లోపాలను గుర్తించి, ఇంకా ఎలాంటి సదుపాయాలు కల్పిస్తే బాగుంటుందా అనే విషయాలను పరిశీలిస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com