Loan Waiver : సాగు చేసిన భూములకే రైతు భరోసా : -మంత్రి తుమ్మల

రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి అనేక సమస్యలు, ఒడిదుడుకులు ఉన్న ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రుణమాఫీ చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులను కాపాడుకుంటామని వెల్లడించారు. శుక్రవారం అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు, ఒడిదుడుకులు ఎదురైనా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 22 లక్షల మంది రైతులకు రూ. 18 వేల కోట్ల వారి ఖాతాలో వేసినట్లు తెలిపారు. తెల్ల కార్డు లేని మూడు లక్షల మంది రైతులకు కూడా ఈ నెల చివరికి వరకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. రుణమాఫీ కోసం అనేక నిబంధనలు పెట్టామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని, రుణమాఫీ తర్వాత రైతు భరోసాను కూడా విడుదల చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో పండించే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని, గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొండలకు, గుట్టలకు డబ్బులు ఇచ్చిందని చెప్పారు. ఇలా రూ. 25 వేల కోట్ల ప్రజాధనాన్ని వృథా చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇలాంటి తప్పు జరగదని, ఈసారి పంట వేసిన రైతుకే రైతు భరోసా వస్తుందని చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com