TG : మంత్రి పదవులు నాకేం కొత్త కాదు : మంత్రి తుమ్మల

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మిగతా 20 లక్షల మందికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసే బాధ్యత తమదేనని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. తనకు మంత్రి పదవులు కొత్తకాదని తెలిపారు. మంత్రి పదవి కోసమో, ఇతర పదవులకు ఆశపడి మాట్లాడే నైజం తనది కాదన్నారు. రుణమాఫీపై ప్రభుత్వం స్పష్టమైన వివరాలు ఎప్పటికప్పుడు వెల్లడించినప్పటికీ బీజేపీ నాయకులు రైతులను గందరగోళపరిచి రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దీక్షల పేరిట కొత్త డ్రామాకు తెరతీశారని మండిపడ్డారు. గురువారం మీడియా ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మొత్తం 65.56 లక్షల మంది రైతులు ఉన్నారన్నారు. భూములు ఉండి బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతుల సంఖ్య 42 లక్షలు అన్నారు. 2018 రుణమాఫీ పథకంలో గత ప్రభుత్వానికి అందిన ఖాతాలు 40 లక్షలు మాత్రమే అన్నారు. అందులో కనీసం 20 లక్షల మందికి కూడా రుణమాఫీ కాలేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించిన 42 లక్షల మందికి మొదటి పంటకాలంలోనే రుణమాఫీ ఈ ఏడాదిలోనే అమలు చేయడానికి చిత్తశుద్ధితో ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com