MISS WORLD: హెరిటేజ్ వాక్.. చార్మినార్ దగ్గర భారీ భద్రత

చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు

హైదారబాద్‌లోని పాతబస్తీలో నగర పోలీసులు హై అలర్ట్‌లో ఉన్నారు. మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఇవాళ చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఈ మేరకు చార్మినార్ వద్ద భారీ భద్రతను పోలీసులు ఏర్పాటు చేశారు. మరోవైపు చార్మినార్ వద్ద మూడు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి డ్రోన్లు ఎగరవేయొద్దని ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. మదీనా, చార్మినార్, శాలిబండ, వొల్గా జంక్షన్, ఖిల్వత్ రహదారులు పూర్తిగా క్లోజ్ చేశారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచన జారీ చేశారు.

కాగా, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో చార్మినార్ వద్ద ఇవాళ ప్రపంచ సుందరీమణులు సందడి చేయనున్నారు. హైదరాబాద్ నగరంలోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్, చౌమహల్లా ప్యాలెస్‌ను ప్రపంచ అందగత్తెలు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే చార్మినార్ నుంచి చౌమహల్లా వరకు హెరిటేజ్ వాక్ నిర్వహించనున్నారు. ఇక మిస్ వరల్డ్ పోటీదారులు లాడ్ బజార్‌లో ఎంపిక చేసిన దుకాణాల్లో గాజులు, అలంకరణ వస్తువుల కొనుగోలుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లతో చార్మినార్ పరిసర ప్రాంతాలు ముస్తాబు చేసింది.

Tags

Next Story