Aadi Srinivas : గీత కార్మికులకు అండగా ఉంటాం : ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్

గౌడ కార్మికులు ప్రమాదాల నుంచి రక్షించుకోవడానికి కాటమయ్య రక్షక కవచం కిట్ ఉపయోగపడే విధంగా ఉంటుందని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. మంగళవారం వేములవాడ ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కొత్త గ్రంథాలయ భవనంలో కాటమయ్య రక్షక కవచ కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి గీత కార్మికులకు కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ, గీత కార్మికులకు అవసరమైన సహాయం అందించడానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉందన్నారు. చెట్లపై పనిచేస్తున్న కార్మికులు ప్రమాదాల బారిన పడకుండా కాటమయ్య రక్షక కవచం కిట్లు అందించడం జరుగుతోందని చెప్పారు. ఈ కిట్ కార్మికులకు ప్రాథమిక రక్షణను అందిస్తూ, ప్రమాదాల కారణంగా గాయపడకుండా ఉండేందుకు దోహదం చేస్తుందని తెలిపారు. గౌడ కులస్తులకు ప్రభుత్వ పక్షాన పెన్షన్లు, ప్రమాదాల సమయంలో పరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వానికి అధికారం చేపట్టే సమయంలో ఆర్థికంగా చాలా సంకటంలో ఉన్నట్టు వివరించారు. రాష్ట్రం ప్రతి నెలా రూ.18 వేల కోట్ల ఆదాయం వస్తుండగా, అందులో రూ.6 వేల కోట్లు అప్పుల వడ్డీలకే ఖర్చవుతున్నాయన్నారు. అయితే, ఆర్థిక ఇబ్బందులకు మధ్య కూడా అభివృద్ధి , సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ముంపు గ్రామాల ప్రజలకు ఉన్న ఇబ్బందులను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 200 మంది గౌడ కార్మికులకు కాటమయ్య రక్షణ కవచ కిట్లను పంపిణీ చేయడానికి ప్రభుత్వ ప్రయోగం కొనసాగుతున్నట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. వేములవాడ , సిరిసిల్ల నియోజకవర్గాల్లో 400 మందికి ఈ కిట్లను పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమానికి బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజ మనోహర్, అబ్కారీ శాఖ అధికారి పంచాక్షరి, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, సిబ్బంది , తదితరులు పాల్గొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com