తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్

తెలంగాణలో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల హీట్
ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు.

తెలంగాణలో రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.. నామినేషన్ల పర్వం ఇప్పటికే మొదలైంది. అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తుండగా.. ఇప్పటికే ప్రక్రియ పూర్తిచేసిన వారు ప్రచారంలో నిమగ్నమయ్యారు. నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ తరపున రాములు నాయక్‌ నామినేషన్‌ దాఖలు చేశారు.. నల్గొండ కలెక్టరేట్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి పాల్గొన్నారు.

2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో రాములు నాయక్‌ ముందుండి పోరాటం చేశారని ఉత్తమ్‌ గుర్తు చేశారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎన్నిసార్లు ద్రోహం చేశారో ప్రజలకు తెలుసన్నారు.

నల్గొండ పట్టణంలోని మేకల అభినవ్‌ స్టేడియం,అటవీశాఖ పార్కులలో వాకర్స్‌తో కలిసి ప్రచారం నిర్వహించారు నల్గొండ-ఖమ్మం- వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి. రాష్ట్రంలో 1లక్ష 90వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే.. వాటిని భర్తీ చేయడంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ప్రేమేందర్‌రెడ్డి ఆరోపించారు.

నిరుద్యోగ భృతి ఇస్తామని గత ఎన్నికల్లో నిరుద్యోగులకు ఆశ పెట్టి ఓట్లు దండుకుని.. ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వలేదని విమర్శించారు. నిరుద్యోగులు, పట్టభద్రుల సమస్యలే తమ ఎజెండా అని బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్ధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి అన్నారు.

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక పచ్చీస్‌ ప్రభారీ సమావేశం నిర్వహించారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు సమావేశానికి హాజరయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటు వేయకూడదో వంద కారణాలు చెబుతానన్నారు.. అదే సమయంలో బీజేపీ అభ్యర్థులను ఎందుకు గెలిపించాలో కూడా వంద కారణాలు చెబుతానన్నారు.

అటు నల్గొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటి వరకు మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. తెలంగాణ ఇంటి పార్టీ అభ్యర్థి చెరుకు సుధాకర్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీ అభ్యర్థి.. మరికొందరు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. ఈనెల 23 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు అధికారులు.

Tags

Read MoreRead Less
Next Story