రాష్ట్రమంతటా హైడ్రాను విస్తరించాలి.. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేఖ

రాష్ట్రమంతటా హైడ్రాను విస్తరించాలని సీఎం రేవంత్ రెడ్డిని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లను కాపాడాల్సిన అవసరం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. లేకపోతే భవిష్యత్‌లో హుస్సేన్ సాగర్‌కు చేరాల్సిన వరద నీరు రోడ్లపైకి వచ్చే ప్రమాదం ఉన్నదన్నారు. గ్రేటర్ పరిధిలో జలాశయలు, చెరువులు, కుంటల పుల్ ట్యాంక్ లెవల్ (ఎఫ్ టీఎల్), బఫర్ జోన్‌ను ఆక్రమించుకున్నోళ్లపై హైడ్రా చేస్తున్న కార్యక్రమం సక్సెస్ పుల్ అవుతుందని ఆయన లేఖలో ప్రస్తావించారు. నిబంధనలకు విరుద్ధంగా జలాశయాల నీటి నిల్వలకు ఆటంకం కలిగించేలా చేపట్టిన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేయడం స్వాగతించదగిన విషయమన్నారు. అయితే, హైడ్రా కమిషనర్ రాజకీయాలకు అతీతంగా, ఎలాంటి ఒత్తిడి లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. అక్రమ నిర్మాణాలు, బఫర్ జోన్లలోని వ్యాపార సంస్థలను కూడా తొలగించాలన్నారు. ఇక జిల్లాల్లోనూ హైడ్రా యాక్టివిటీస్ కొనసాగించాలన్నారు. ఆయా జిల్లాల పరిధిలోని చెరువులు, కుంటల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించే బాధ్యత కలెక్టర్లకు ఇవ్వాలని కోరారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com