MLC Kavitha: ట్విటర్ వేదికగా అమిత్‌షాకు ఎమ్మెల్సీ కవిత ప్రశ్నలు..

MLC Kavitha: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తెలంగాణ పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు. తెలంగాణలో అడుగుపెడుతున్న అమిత్‌షా.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్‌గా ఇవ్వాల్సిన 3వేల కోట్ల బకాయిలు ఎప్పుడిస్తారని అడిగారు. వెనకబడిన ప్రాంతాలకు ఇవ్వాల్సిన 1350 కోట్ల గ్రాంట్, కేంద్రం నుంచి రావాల్సిన 2వేల 247 కోట్ల జీఎస్టీ పరిహారం, రాకెట్‌గా దూసుకెళ్తున్న నిత్యావసర వస్తువుల ధరలు, దేశంలో నిరుద్యోగం రికార్డ్‌స్థాయిలో పెరగడం, బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారం.. బీజేపీ హయాంలోనే మత కల్లోలాలు ఎక్కువగా జరగడం, ప్రపంచంలో ఏ దేశంలో లేనంతగా ఇండియాలోనే పెట్రోల్, గ్యాస్ ధరలు ఉండడంపై తెలంగాణ ప్రజలకు సమాధానాలు కావాలన్నారు.
తెలంగాణ ప్రజలను కలిసేందుకు వస్తున్న అమిత్‌షా.. అదే తెలంగాణకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐఐఎం, IISER, NID, మెడికల్ కాలేజీలు, నవోదయ స్కూళ్లలో.. గత 8 ఏళ్లలో ఒక్కటి కూడా ఇవ్వకపోవడానికి సమాధానం చెప్పాలన్నారు ఎమ్మెల్సీ కవిత. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు 24వేల కోట్ల నిధులు ఇవ్వొచ్చని నీతి ఆయోగ్ ప్రతిపాదించినా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కర్నాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టు, కెన్ బెట్వా రివర్ లింకింగ్ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చి.. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు మాత్రం జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదని ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com