Kodandaram : నేను ప్రజల మనిషిని.. నాకు సెక్యూరిటీ వద్దు : ఎమ్మెల్సీ కోదండరాం
ఇటీవల గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఫ్రొఫెసర్ కోదండరామ్.. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరించారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు. సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదన్నారు.గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం 16లక్షల రేషన్ కార్డుల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, గత ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చి ఉంటే రుణమాఫీపై ఇలాంటి సమస్యలు వచ్చేవి కాదని పేర్కొన్నారు. యూనివర్సిటీల్లో సామాజిక కూర్పు అవసరం కాబట్టి నియామకం ఆలస్యమైందని, ప్రస్తుతం యూనివర్శిటిల పరిస్థితిని చూశాక నియామకాలను తక్షణమే చేపట్టాల్సిన అవసరం ఉందని వెల్లడించారు.
గత ప్రభుత్వం పోస్టులు వేయకుండా నిరుద్యోగుల ప్రాణాలను తీసుకుందని కోదండరాం మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఉద్యోగాల భర్తీపై మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తుందన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణను అమలు చేయాలని, ఆర్థిక స్థితి గతుల ఆధారంగా కేటగిరిలు చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమం పుట్టినప్పటి నుంచి మద్దతు ఇస్తున్నామని గుర్తుచేశారు. రాష్ట్రంలో జోన్లను ఇష్టారాజ్యంగా చేశారని, అనాలోచితంగా కొత్త జిల్లాలను చేశారన్నారు. బీఆర్ఎస్ తీసుకున్న అవివేక నిర్ణయాలను ఒక్కొక్కటిగా పరిష్కరించాల్సి వస్తోందన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం విషయంలో విద్వేషపూరితంగా పోవాల్సిన అవసరం లేదని, రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహం రెండూ సెక్రటేరియట్ ప్రాంగణంలో పెట్టవచ్చన్నారు. తనకు కేబినెట్ లో చోటు దక్కుతుందన్న ప్రచారం.. ఊహాగానాలేనని ఆయన స్పష్టం చేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com