MODI: జులై 8న తెలంగాణలో మోదీ పర్యటన

MODI: జులై 8న తెలంగాణలో మోదీ పర్యటన
కేంద్ర ప్రభుత్వం మజూరు చేసిన వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు కాజీపేట రైల్వే పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌నకు భూమి పూజ చేయనున్నారు.

ఎన్నికలు తరుముకొస్తున్న వేళ అన్ని పార్టీల్లో హడావుడి మిన్నంటుతోంది. అధికార పక్షాలు అభివృద్ధి, సంక్షేమ మంత్రం పఠిస్తుంటే విపక్షాలు ప్రభుత్వ వ్యతిరేక తంత్రం రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు రాబోతుండడం ఆసక్తి రేపుతోంది.పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపలను చేసేందుకు మోదీ జులై 8న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఆయన బహిరంగ సభలో మాట్లాడనున్నారు. కమళ నాథులు మోదీ రాకతో మరోసారి రాష్ట్ర బీజేపీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు. మరి మోదీ ప్రసంగంలో ఉండే అంశాలేంటి, గతంలో కేసీఆర్‌ పేరు ఎక్కడా ప్రస్తావించని మోదీ అనూహ్యంగా భోపాల్‌ బహిరంగ సభలో కేసీఆర్‌ ఆయన కూతురంటూ విరుచుకుపడ్డారు. మరి తెలంగాణ గడ్డపై కూడా నేరుగానే తలపడతారా లేదా చూడాలి.

కేంద్ర ప్రభుత్వం మజూరు చేసిన వరంగల్‌ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయడంతో పాటు కాజీపేట రైల్వే పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌నకు భూమి పూజ చేయనున్నారు. దేశ వ్యాప్తంగా 7 మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌లను ఆమోదించిన కేంద్రం అందులో ఒకటి తెలంగాణకు కేటాయించింది. దీనికి భూమిని కేటాయించాల్సిందిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు వ్యయం 4,445 కోట్ల రూపాయలు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ వేదికగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

దీంతో పాటు తెలంగాణ విభజన బిల్లులో పెట్టిన మరో హామీని నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. విభజన చట్టంలో ఉన్న హామీలను నెరవేర్చడంలో కేంద్రం విఫలమైందని రాష్ట్ర ప్రభుత్వం ఆరోపణల నేపథ్యంలో కాజీపేటలో రైల్వే పిరియాడిక్ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్‌నకు భూమి పూజ చేయనున్నారు.ఈ ఓవర్ హాలింగ్ వర్క్ షాప్ ప్రాజెక్టు అంచానా వ్యయం 521 కోట్లుగా రైల్వే అధికారులు చెబుతున్నారు. ఐతే మోదీ రాక సందర్భంగా అధికారిక రాజకీయ కార్యక్రమాలకు వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు. రెండు ప్రాజెక్టుల శంకుస్థాపన తర్వాత తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మోదీ మాట్లాడేందుకు బహిరంగ సభను నిర్వహించనున్నారు.

కర్ణాటక ఎన్నికల తరువాత బీజేపీ క్యాడర్‌లో తగ్గిన జోష్‌, నిస్తేజాన్ని మోదీ పర్యటనతో దూరం చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల గ్రౌండ్స్ వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి ఫోన్ చేసి మోదీ కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాటు పూర్తి చేయాలన్నారు. ప్రధాన కార్యదర్శులతో చర్చించిన బండి,లక్ష మందికి తగ్గకుండా సభ నిర్వహించేలా కరసరత్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story