Sangareddy : ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న తల్లి.. సంగారెడ్డి జిల్లాలో విషాదం

తల్లి ప్రేమను మించినది ఏదీ లేదు. కానీ సంగారెడ్డి జిల్లాలో జరిగిన ఒక విషాద ఘటన ఆ నమ్మకాన్ని వమ్ము చేసింది. ఇద్దరు పసిబిడ్డలను కన్న ఆ తల్లి, వారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ హృదయ విదారక సంఘటన స్థానికులను, కుటుంబసభ్యులను తీవ్ర దుఃఖంలో ముంచెత్తింది.
సంగారెడ్డి జిల్లా నిజాంపేటలో నివసించే బుసి రాములు, సాయమ్మల కుమార్తె ప్రేమలతకు నాలుగేళ్ల క్రితం దామరచెరువు గ్రామానికి చెందిన సంగమేష్‌తో వివాహమైంది. ఈ దంపతులకు ధనుష్ (3), సూర్యవంశి (2 నెలలు) అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ప్రేమలతను ఆమె భర్త సంగమేష్ నిజాంపేటలోని పుట్టింట్లో వదిలి వెళ్లిపోయాడు. దీంతో మనస్థాపం చెందిన ప్రేమలత ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఘోరానికి పాల్పడింది. ఇద్దరు పిల్లలను గొంతు నులిమి చంపి.. అనంతరం ఆమె కూడా ఆత్మహత్య చేసుకుంది. సాయంత్రం ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులు.. పిల్లలు, ప్రేమలత విగతజీవులుగా పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వారి ఆర్తనాదాలు విన్న గ్రామస్తులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఇద్దరు పిల్లలను హత్య చేసి, ఆ తర్వాత ప్రేమలత ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. అయితే ఈ ఘటనపై ఇంకా పలు అనుమానాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com