MP DK Aruna : బన్నీ పట్ల సీఎం దారుణంగా వ్యవహరిస్తున్నారు : ఎంపీ డీకే అరుణ

సీఎం రేవంత్ రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం అల్లు అర్జున్ పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని బీజేపీ ఎంపీ డీకే అరుణ అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనను తన రాజకీయాల కోసం వాడుకోవడం సరికాదన్నారు. ఇక్కడ సినిమా హీరోలా? రాజకీయ నాయకులా? మరొకరా? అనే విషయం పక్కన పెడితే రాజకీయాలు చేయవద్దన్నారు. అల్లు అర్జున్ అరెస్ట్, ఆయన కుటుంబాన్ని ఇబ్బందిపెట్టడం, ఇంటిపై దాడి ఇవన్నీ కక్ష సాధింపు చర్యలేనని మండిపడ్డారు. మంగళవారం డీకే అరుణ కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ... సినీ పరిశ్రమ, రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబానికి అండగా ఉండాలని సూచించారు. శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానన్నారు. రేవతి మరణం బాధాకరమన్నారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆలోచించాలని సూచించారు. కాంగ్రెస్, మజ్లిస్ ఒకటేనని అసెంబ్లీ జరుగుతున్న తీరును చూసిన ఎవరికైనా అర్థమవుతుందన్నారు. సంధ్య థియేటర్ ఘటనపై మజ్లిస్ పార్టీతో ప్రశ్న అడిగించుకొని.. రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చినట్లుగా ఉందన్నారు. అల్లు అర్జున్ పట్ల పోలీసుల తీరు సరైంది కాదన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి వ్యవహారాలను రాజకీయం చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు గాడి తప్పాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com