Musi River : మూసీ నదికి 'మురికి' వదలాల్సిందే..

Musi River  : మూసీ నదికి మురికి వదలాల్సిందే..
X

మూసీ చుట్టూ ఎన్నో రకాల రాజకీయాలు ఇప్పుడు తెలంగాణలో కనిపిస్తున్నాయి. మూసీ నదిని పునరుద్ధరించడం అనేది బీఆర్ ఎస్ లోనే ఒక ప్రాజెక్టుగా తీసుకోవాలి అనుకున్నారు. కానీ అది కుదరలేదు. నీటి ప్రాజెక్టులపై ఎక్కువ ఫోకస్ పెట్టడం వల్ల మూసీ పక్కకు వెళ్లిపోయిందేమో తెలియదు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాత్రం మూసీ ప్రాజెక్టు ప్రధానంగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మూసీ నదిని ప్రక్షాళన చేస్తామంటూ సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఈ మూసీ ప్రాజెక్టుపై ఎన్నో రకాల వాదనలు వస్తున్నాయి. బీఆర్ ఎస్, బీజేపీ ఈ ప్రాజెక్టు కేవలం రియల్ ఎస్టేట్ కోసమే స్టార్ట్ చేస్తున్నారని.. ఇందులో అందరికీ సమాన న్యాయం జరగట్లేదని కేటీఆర్ అంటున్నారు. బీజేపీ మాత్రం ఈ ప్రాజెక్టు వల్ల కాంగ్రెస్ పెద్ద స్కామ్ చేస్తోందని.. కొన్ని భూములను లాగేసుకునేందుకే ఈ ప్రాజెక్ట్ చేపడుతున్నారంటూ ఆరోపిస్తోంది.

అయితే ఇక్కడ ఎవరి వాదనలు ఎలా ఉన్నా.. మూసీకి మురికి వదలాల్సిందే అని అక్కడున్న బాధితులు చెబుతున్న మాట. మూసీ పక్కన ఉండాలని ఎవరూ కోరుకోలేని విధంగా ఆ నదిని తయారు చేశారు. ప్రజలు కూడా ఇందులో భాగస్వాములే. ఎందుకంటే మూసీ నది మొదలైన చోట ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అందరికీ తెలుసు. కానీ హైదరాబాద్ కు వచ్చేసరికి జంతువుల కలేబరాల దగ్గరి నుంచి.. ఇంట్లో కనిపించే చెత్త దాకా అన్నీ వేసేస్తున్నారు.

మూసీ నదిని మురికి కూపంగా చేయడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యం ఎంత ఉందో.. ప్రజల సివిక్ సెన్స్ కూడా అంతే ఉంది. మన నదిని నాశనం చేయొద్దు అనే కామన్ సెన్స్ మనకు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. కానీ ఇప్పుడైనా సరే మూసీ నదికి ఓ రూపం తీసుకురావాల్సిన సమయం వచ్చింది. లేదంటే హైదరాబాద్ భవిష్యత్ లో మూసీ ఒక పెద్ద తప్పుగా మిగిలిపోతుంది. భవిష్యత్ తరాలు హైదరాబాద్ లో ఉండలేని పరిస్థితులు వస్తాయి. కాబట్టి రాజకీయాలు పక్కన పెట్టి మూసీని పునరుజ్జీవించేలా చేయడమే మంచిదని ప్రజలు చెబుతున్నారు.

Tags

Next Story