నల్గొండ జిల్లా ప్రమాదంలో పదికి చేరిన మృతుల సంఖ్య

రెక్కాడితేగాని డొక్కాడని నిరుపేద కుటుంబాలను ఓ ప్రమాదం బలి తీసుకుంది. ఒకే గ్రామానికి చెందిన రోజు వారీ మహిళా కూలీలు. రోజులాగే గురువారం కూడా కూలి పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా మృత్యువు కబలించింది. కాసేపట్లో ఇంటికి చేరిపోతామనుకునే లోపే.. లారీ, బొలెరో రూపంలో పది మందిని మృత్యువు కాటేసింది. బొలొరో వాహనాన్ని దాటే ప్రయత్నంలో ఎదురుగా వస్తున్న ఆటోను లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళా కూలీల్లో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. తరువాత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో నలుగురు మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన నల్గొండ జిల్లా.. పెద్ద అడిశర్లపల్లి మండలం.. అంగడిపేట స్టేజీ సమీపంలోని హైదరాబాద్ – నాగార్జునసాగర్ ప్రధాన రహదారిపై నిన్న సాయంత్రం చోటు చేసుకుంది.
దేవరకొండ మండలం చింతబాయి గ్రామానికి చెందిన 20 మంది కూలీలు పెద్ద అడిశర్లపల్లి మండల పరిధిలోని రంగారెడ్డిగూడెం, పోతునూరు గ్రామాల్లో వరి నాట్లు వేసేందుకు ఆటోలో వెళ్లారు మహిళా కూలీలు. సాయంత్రం వరకు వరినాట్లు వేశారు. పని ముగించుకుని అదే ఆటోలో తిరుగు పయనమయ్యారు. అంగడిపేట క్రాస్‌రోడ్ సమీపంలోని పెట్రోల్ బంక్ సమీపంలోకి రాగానే హైదరాబాద్ నుంచి సాగర్ వైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఓ లారీ ఓవర్‌టేక్ చేయబోయింది. ఈ క్రమంలో ఎదురుగా కూలీలు వెళ్తున్న ఆటోను లారీ వేగంగా ఢీ కొట్టింది. బొలోరో వాహనం కూడా అదుపుతప్పి బోల్తాపడింది.
అతి వేగంగా ఆటోను లారీ ఢీకొనడంతో అందులో ఉన్న కూలీలంతా రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయారు. అసలు ఏం జరిగిందో తెలుసుకునే లోపే వారిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మిగిలిన వారు తీవ్రగాయాలతో రక్తమోడుతూ ఆర్తనాదాలు చేశారు. పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్న సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు కలసి ఆటోలో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకు తీశారు.
ప్రమాదంలో ఆటోడ్రైవర్ 40 ఏళ్ల కొట్టం మల్లేశంతో పాటు నోముల పెద్దమ్మ, నోముల సైదమ్మ , గొడుగు ఇద్దమ్మ , కొట్టం పెద్దమ్మ , నోముల అంజమ్మ లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో తీవ్ర గాయాల పాలైన కొట్టం చంద్రమ్మ, గొడుగు లింగమ్మ, నోముల అలివేలును హైదరాబాద్‌కు తరలిస్తుండగా మధ్యలో మృతి చెందారు. ఇవాళ మరో మహిళ మృతి చెందింది. ఈ విషాదకర సంఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వీరిలో ఆటోడ్రైవర్ కొట్టం మల్లేశ్, అతడి భార్య కొట్టం చంద్రమ్మ, తల్లి కొట్టం పెద్దమ్మలు ఉన్నారు. మల్లేశ్ రోజూ ఆటో నడుపుకుని కుటుంబాన్ని పోషిస్తుంటే.. భార్య చంద్రమ్మ, తల్లి పెద్దమ్మలు కూలీకి వెళ్లి చేదోడుగా ఉండేవారు. తల్లిదండ్రుల మృతితో మల్లేష్ పిల్లలు అరవింద్, హరీష్ అనాథలయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com